అరకు మత్తులో.. యువత చిత్తు..!

22 Aug, 2021 21:15 IST|Sakshi

సరిహద్దులు దాటుతున్న గంజాయి

చిత్తూరు మీదుగా గార్డెన్‌ సిటీకి గుట్టుగా ఎగుమతి

బానిసలవుతున్న మైనర్లు, యువత

స్మగ్లర్లకు దడ పుట్టిస్తున్నపోలీసులు

అందమైన ప్రకృతి ఒడిలో గంజాయి పెరుగుతోంది. గార్డెన్‌ సిటీగా పేరొందిన బెంగళూరుకు తరలిపోతోంది. ఈ మార్గంలోని చిత్తూరులో పిల్లలను మత్తుకు బానిసలుగా చేస్తోంది. ఇటీవల మైనర్లు గంజాయి తాగుతున్న వీడియోలు వెలుగులోకి రావడంతో పోలీ సులు రంగంలోకి దిగారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. పిల్లలకు హెచ్చరికలు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు.

చదవండి: బైకుల దొంగ.. 18 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం 

చిత్తూరు అర్బన్‌: అరకు.. ఈపేరు వింటేనే ఎత్తయిన కొండలు.. అందమైన లోయలు. ప్రకృతి హొయలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఇంత అందమైన వనంలో టన్నుల కొద్దీ గంజాయి సాగు చేసి స్మగ్లింగ్‌ చేయడంలో ఆరితేరినవారూ ఉన్నారు. ఇటీవల అరకు నుంచి పెద్ద మొత్తంలో జిల్లాకు గంజాయి రవాణా అవుతుండడమే దానికి నిదర్శనం. దీనిమత్తులో యువత చిత్తవుతున్నారు.

రవాణా ఇలా..  
విశాఖ జిల్లాలోని అరకులో గంజాయి మొక్కల పెంపకం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఈ పంటను నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒకరూపంలో  ఇతర ప్రాంతాలకు చేరుతోంది. ఇక విశాఖలోని అరకు, గాజువాక ప్రాంతాల నుంచి చిత్తూరు జిల్లాకు చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి ఆకులను బాగా ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి 5 కిలోలు, 10 కిలోల సంచుల్లో జిల్లాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కోసారి 20 కేజీల బ్యాగుల రూపంలో కూడా ఇక్కడకు వస్తోంది. వీటి రవాణాలో ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సుల్లోనే లగేజీ రూపంలో తీసుకొస్తుండగా, చాలా వరకు లారీల్లో ఇక్కడకు తరలిస్తున్నా రు. నిత్యావసర సరుకులు, గృహ నిర్మాణ పరికరాలతో పాటు గంజాయి బ్యాగులను లారీ అడుగు భాగంలో దాచి ఉంచి కొనుగో లుదారులకు వీటిని చేరుస్తున్నారు.

మారువేషాలతో..  
చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె ప్రాంతంలో కొందరు మైనర్లు గంజాయి పీలుస్తున్న వీడియాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందాన్ని నియమించి రంగంలోకి దింపారు. మొత్తం 15 మందితో ఉన్న ఈ బృందం అరకు, గాజువాక ప్రాంతాలకు వెళ్లి మధ్యవర్తుల అవతారం ఎత్తింది. వంద కేజీల గంజాయి కావాలంటూ మారువేషాల్లో బేరమాడి అరకుకు చెందిన ప్రధాన స్మగ్లర్లు రమణ, కుడా భాస్కర్, గాజువాకకు చెందిన పోతురాజును ఇటీవల అరెస్టు చేశారు. వీరి నుంచి రాబట్టిన సమాచారంతో పూతలపట్టు బండపల్లె, కల్లూరు, మదనపల్లె, పాకాల, తవణంపల్లె ప్రాంతాలకు చెందిన 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్‌ కేసులో మరో నింది తుడు బెంగళూరుకు  చెందిన సిద్ధూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

వయా బెంగళూరు..  
విశాఖ జిల్లా నుంచి వస్తున్న గంజాయి తొలుత తిరుపతికి చేరుతోంది. ఇక్కడ రైల్వే స్టేషన్, బస్టాండు సమీప ప్రాంతాల్లో కొందరు చిన్నపాటి పొట్లాలుగా చుట్టి అమ్ముతున్నారు. పది సిగరెట్లలో ఉండే పొగాకు పరిమాణంలో ఉన్న ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. తిరుపతి తరువాత పశ్చిమ ప్రాంతాలకు పూతలపట్టు మండలంలోని బండపల్లె నుంచి పెద్దమొత్తంలో తరలిస్తున్నారు. పుంగనూరు, పలమనేరు, కల్లూరు, పాకాల, మదనపల్లెతోపాటు కుప్పం వరకు  సరుకు బండపల్లె నుంచే వెళుతోంది. ఇంతటితో ఆగని గంజాయి స్మగ్లింగ్‌ బెంగళూరుకు సైతం పాకింది. బెంగళూరులోని మెజిస్టిక్, రైల్వే స్టేషన్లలో లభించే గంజాయి అరకుదేనని పోలీసులు తేల్చారు. 

జీవితఖైదు కంటే ఎక్కువ శిక్ష 
మాదకద్రవ్యా ల వాడకం, అమ్మకం రెండూ నేరమే. ఈ కేసులో పట్టుబడిన వారిపై నేరం రుజువైతే జీవితఖైదు కంటే ఎక్కువ శిక్ష పడుతుంది. గంజాయి కేసులో మూలాలను పట్టుకుని, ప్రధాన స్మగ్లర్లను ఇప్పటికే అరెస్టు చేశాం. మరికొందరిని అరెస్టు చేయడానికి నిఘా పెట్టాం. 18 మందిపై షీట్లు ఓపెన్‌ చేశాం. గంజాయి మత్తుకు ఎక్కువగా యువత చిత్తవుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. 
– ఎస్‌.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు

చదవండి: చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం

మరిన్ని వార్తలు