Kodanad Case: వీడని మిస్టరీ.. అంతులేని ‘కొడనాడు’ కథ

5 Sep, 2021 07:19 IST|Sakshi

విచారణకు అదనంగా మరో నాలుగు ప్రత్యేక బృందాలు 

కేరళ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దర్యాప్తు 

కొడనాడు మిస్టరీ.. రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించగా.. డీఎంకే రాకతో మళ్లీ వేగవంతమైంది. తాజాగా  దర్యాప్తు కోసం మరో 4 ప్రత్యేక బృందాలను నియమించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కొడనాడు ఎస్టేట్‌ ఘటనలపై విచారణ వేగం పుంజుకుంది. పోలీసు ఉన్నతాధికారుల రంగ ప్రవేశం, అదనంగా నాలుగు విచారణ బృందాల ఏర్పాటు చేయడం రాజకీయవర్గాల్లో కలవరానికి దారితీసింది.

సినిమా తరహాలోనే.. 
అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఏడాదికి ఒకసారైనా కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. ఆమెతో నెచ్చెలి శశికళ కూడా తప్పక ఉండేవారు. జయ మరణం తరువాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 ఏప్రిల్‌ 24వ తేదీన ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యారు. అలాగే ఏస్టేట్‌ బంగ్లాలోని విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇందుకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన సయాన్, వలయారు మనోజ్, మనోజ్‌ స్వామి, జితిన్‌రాయ్, సంతోష్‌స్వామి, ఉదయకుమార్‌ సహా 10 మందిని పోలీసులు అప్పట్లో అరెస్ట్‌ చేశారు.

పోలీసులు జయ కారు డ్రైవర్‌ కనకరాజ్‌ను అనుమానించి విచారణకు పిలిచే సమయానికి అతడు సేలంలో (ఏప్రిల్‌ 28) రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం, ఎస్టేట్‌ లోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ దినేష్‌ ఆత్మహత్య చేసుకోవడం, కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సయాన్‌ భార్య, బిడ్డ మరణించడం..ఇలా వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు మరింత సంచలనానికి దారితీశాయి.  

కొత్తేరి టూ ఊటీ.. 
ఈ కేసు విచారణ కొత్తేరీ కోర్టు నుంచి ఊటీ కోర్టుకు మారింది. అప్పటి నుంచి నీలగిరి జిల్లా ఊటీలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ జరుపుతోంది. కొడనాడు ఎస్టేట్‌ మేనేజర్‌ నటరాజన్‌ను పశ్చిమ మండల ఐజీ సుధాకర్, నీలగిరి ఎస్పీ ఆశిష్‌ రావత్‌ తదితర పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం 3 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈక్రమంలో మరికొందరు ముఖ్యులను విచారించేందుకు మరో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్‌ నిపుణులు రాజమోహన్, విద్యుత్‌శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ను విచారించేందుకు సమన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం కేరళ, సేలం, చెన్నైకు ప్రత్యేక బృందాలు వెళ్లేందు కు నిర్ణయించుకున్నాయి.

నాలుగు వారాల గడువు.. 
కొడనాడు ఘటనలపై ఊటీలోని న్యాయస్థానంలో ఇటీవల విచారణ జరిగింది. ఈ కేసులో ఇంకా పలువురిని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరగా, కోర్టు నాలుగువారాల గడువు ఇచ్చింది. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఊటీలోని పాత ఎస్పీ కార్యాలయ భవనంలో ప్రత్యేక విచారణ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేయడం గమనార్హం.

సుప్రీంకోర్టులో 7న విచారణ  
కొడనాడు ఎస్టేట్‌ కేసులో కోయంబత్తూరుకు చెందిన రవి అనే పోలీసును అధికారులు సాక్షిగా చేర్చారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ విచారణపై స్టే విధించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో రవి పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రవి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ ఈనెల 7వ తేదీన విచారణకు రానుంది.

ఇవీ చదవండి:
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచి మత్తుమందు కలిపి..
వ్యాన్‌ డ్రైవర్‌తో జూనియర్‌ లెక్చరర్‌ ప్రేమ పెళ్లి, చివరకు..

మరిన్ని వార్తలు