స్పోర్ట్స్‌ బైక్‌లంటే మహా సరదా.. పది చోరీలు

1 May, 2021 07:34 IST|Sakshi
పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలు

సాక్షి, చాంద్రాయణగుట్ట: స్పోర్ట్స్‌ బైక్‌లపై తిరిగే సరదా కోసం బైక్‌ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్‌కు చెందిన ఉత్తమ్‌ కుమార్‌(20), సందీప్‌ కుమార్‌(20) నాగోల్‌లోని బిగ్‌ బాస్కెట్‌లో పనిచేసే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

వీరిద్దరికీ స్పోర్ట్స్‌ బైక్‌లు నడపాలంటే మహా సరదా. వీరి సంపాదనతో ఇష్టమైన బైక్‌లు కొనలేకపోయారు. ఈ క్రమంలో ఇళ్ల ఎదుట పార్కు చేసి ఉన్న స్పోర్ట్స్, హైఎండ్‌ బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు. ఇలా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐదు బైక్‌లు, ఎల్‌.బి.నగర్‌ పరిధిలో రెండు, మేడిపల్లి పరిధిలో రెండు, సరూర్‌నగర్‌ పరిధిలో ఒక వాహ నాన్ని చోరీ చేశారు. చోరీ చేసిన వాహనంపై వెళ్తున్న వీరిని విశ్వసనీయ సమాచారంతో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్సైల బృందం వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ తఖియుద్దీన్, కె.చంద్రమోహన్‌ మీర్‌పేట పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని విచారించగా దొంగతనాల చిట్టా బయటపడింది. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల విలువజేసే ఐదు పల్సర్‌ 220సీసీ, రెండు రాయల్‌ ఎన్‌ఫీల్డ్, ఒక కేటీఎం డ్యూక్, ఒక హోండా యాక్టివా, ఒక హోండా షైన్‌ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మీర్‌పేట పోలీసులకు అప్పగించారు. 

చదవండి: రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

మరిన్ని వార్తలు