ట్రయాంగిల్‌ సీ‘రియల్‌’ స్టోరీ!

15 Sep, 2020 03:16 IST|Sakshi
శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు దేవరాజ్‌రెడ్డి, సాయిరెడ్డిలను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు

శ్రావణి ఆత్మహత్యకు ఆ ముగ్గురూ కారణమే 

ఏ–1గా దేవరాజ్‌రెడ్డి, ఏ–2గా సాయికృష్ణ  

ఇద్దరిని అరెస్టు చేసిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు 

పరారీలో ఉన్న నిర్మాత అశోక్‌రెడ్డి కోసం గాలింపు 

సాక్షి, హైదరాబాద్‌: టీవీ సీరియల్‌ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసును ఎస్సార్‌నగర్‌ పోలీసులు కొలిక్కి తీసుకు వచ్చారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో పాటు సినీ నిర్మాత అశోక్‌రెడ్డి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవరాజ్‌రెడ్డి, రెండో నిందితుడు సాయికృష్ణారెడ్డిలను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ సోమవారం వెల్లడించారు. పరారీలో ఉన్న అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి..

ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన శ్రావణి నటనపై ఉన్న ఆసక్తితో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌ వలసవచ్చింది. ఆమెకు ఐదేళ్ల క్రితం సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. సాయి ఏపీలోని అనంతపురం నుంచి వచ్చి, నగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. శ్రావణితో సన్నిహితంగా ఉండటంతో పాటు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సాయి కొన్నాళ్లకు ఆమె కుటుంబానికీ దగ్గరయ్యాడు. అయితే కొన్ని స్పర్థలు తలెత్తిన నేపథ్యంలో శ్రావణి–సాయిలు 2018లో దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె కుటుంబంతో సాయి సంబంధాలు కొనసాగించాడు. అదే ఏడాది అశోక్‌రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో కార్తీక్‌’ చిత్రంలో శ్రావణి నటించింది. అప్పటి నుంచి అశోక్‌రెడ్డితో ఆమె పరిచయం కొనసాగింది.  

టిక్‌టాక్‌తో పరిచయం..  
ఇదిలా ఉండగా.. టిక్‌టాక్‌ ద్వారా గత ఏడాది ఆగస్టు 8న శ్రావణికి కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డితో పరిచయమైంది. ఓ సీరియల్‌లో నటించేందుకు ఆడిషన్స్‌ కోసం దేవరాజ్‌ గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌ వచ్చాడు. అప్పట్లో శ్రావణి ఇంట్లోనే తొమ్మిది రోజుల పాటు ఉన్నాడు. ఈ తొమ్మిది రోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. శ్రావణి ఇంట్లో ఉన్న సందర్భంలోనే దేవరాజ్‌రెడ్డి.. ఆమె ఫోన్‌లోని వివరాలను పరిశీలించాడు. ఆమెకు అశోక్‌రెడ్డితో పాటు సాయికృష్ణతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టిన దేవరాజ్‌రెడ్డి తన స్వస్థలానికి వెళ్లిపోయాడు.

ఆపై కొన్ని సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మళ్లీ హైదరాబాద్‌ వచ్చిన అతను సీతాఫల్‌మండి ప్రాంతంలో కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఓ నటుడి పుట్టినరోజు వేడుకను శ్రావణి ఇంట్లో నిర్వహించారు. దేవరాజ్‌ను కూడా ఆమె ఈ వేడుకకు ఆహ్వానించింది. ఆ సందర్భంలో ఆమె అందరి ముందూ ‘ఐ లవ్‌ దేవరాజ్‌రెడ్డి’అంటూ ప్రకటించింది. అయితే శ్రావణికి అశోక్‌రెడ్డితో పాటు సాయితోనూ సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే తనకు ఆమెపై ఆసక్తి లేదని అతను చెప్పాడు. దేవరాజ్‌కు సర్దిచెప్పడానికి శ్రావణి ప్రయత్నించినా.. అతడు తిరస్కరించాడు. 

దేవరాజ్‌తో ఘర్షణ.. కేసులు..  
కాగా, ఈ ఏడాది మార్చి 20వ తేదీ రాత్రి దేవరాజ్‌కు ఫోన్‌ చేసిన శ్రావణి, అతడిని చంపేస్తానంటూ బెదిరించింది. సాయి, అశోక్‌రెడ్డిల పేర్లు చెప్పి, వారితో సంబంధం ఉందంటూ తన జీవితం నాశనం చేస్తున్నావని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్‌ 21 రాత్రి 8.30 గంటలకు దేవరాజ్‌రెడ్డితో శ్రావణి ఘర్షణ పడింది. ఈ సందర్భంగా శ్రావణి తన సోదరుడు శివ, మరో యువతితో కలిసి అతనిపై దాడికి పాల్పడింది. నీ కారణంగా అశోక్‌రెడ్డితో స్పర్థ లు వచ్చాయంటూ.. వాగ్వాదానికి దిగి కొట్టా రు. దీనిపై దేవరాజ్‌ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రావణి తనను వేధిస్తున్నాడంటూ దేవరాజ్‌పై ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే చాటింగ్‌ ద్వారా దేవరాజ్‌కు నచ్చచెప్పడానికి శ్రావణి ప్రయత్నించింది.

ఈ విషయం తెలిసిన అశోక్‌రెడ్డి, సాయికృష్ణతో పాటు శ్రావణి కుటుంబీకులు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. కాగా, ఈ నెల 7న శ్రావణిని ఓ షూటింగ్‌ లొకేషన్‌లో కలుసుకున్న దేవరాజ్‌రెడ్డి అక్కడ నుంచి ఆమెను పంజగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌కు తీసుకువెళ్లాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ ఆవేశంతో దేవరాజ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీన్ని శ్రావణి అడ్డుకోవడంతో ఆమె చెంపపై కొట్టిన సాయి ఆటోలో ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు దేవరాజ్‌కు ఫోన్‌ చేసిన శ్రావణి తనను అశోక్‌రెడ్డి, సాయిలతో పాటు తన కుటుంబీకులూ వేధిస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత ఫోన్‌ చేసిన శ్రావణి నీతో పాటు అశోక్‌రెడ్డి, సాయి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చనిపోయింది. ఈ ఫోన్‌ రికార్డులన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజ్, సాయిలను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్మాత అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు