సెలవు తీసుకుని వస్తానన్నాడు.. కానీ అంతలోనే

29 Mar, 2021 08:32 IST|Sakshi

అసోంలో గొల్లపేటకు చెందిన ఆర్మీ జవాన్‌ మృతి

మృతునికి రెండు నెలల కుమారుడు  

నెల కిందటే బిడ్డను ఎత్తుకుని ఆ తండ్రి మురిసిపోయాడు. గుండెలపై ఎక్కించుకుని ఆడించాడు. సెలవులు ముగిసిపోవడంతో దేశ రక్షణ విధుల్లో పాల్గొనడానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రీ కొడుకుల మధ్య దూరం శాశ్వతమైపోయింది. నాన్నా.. అని పిలిచినా రాలేని లోకాలకు తండ్రి తరలివెళ్లాడు. అసోంలో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్న వాసుదేవరావు చనిపోయాడని వార్త తెలియడంతో గొల్లపేట ఘొల్లుమంది. 

ఆమదాలవలస రూరల్‌: మండలంలోని గొల్లపేటకు చెందిన ఆర్మీ జవాన్‌ కొల్లి వాసుదేవరావు (31) అసోంలో శనివారం మృతి చెందారు. జవా న్‌ మృతి వార్త కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వాసుదేవరావు 2010లో ఆర్మీలో జవాన్‌ గా ఉద్యోగం సంపాదించాడు. అందరితో కలిసి మెలసి ఉండే వాసుదేవరావు గత ఏడాదే వివాహం చేసుకున్నాడు. వీరికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. వాసుదేవరావు భార్య వసంత ప్రస్తుతం ఎల్‌ఎన్‌పేట మండలం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఏంగా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, బాబు పుట్టినప్పుడు వాసుదేవరావు ఇంటికి వచ్చి వారసుడిని చూసుకున్నాడు. ఎలక్షన్ల సమయంలో కూడా ఇంటి వద్దనే ఉన్నాడు. మళ్లీ సెలవులపై వచ్చి కొడుకును చూసుకుంటానని చెప్పాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. శనివారం రాత్రి ఈ సమాచారం అందడంతో ఆ కుటుంబం తేరుకోలేకపోతోంది. మృతికి గల కారణాలను మాత్రం వివరించలేదు. జవాన్‌ తల్లిదండ్రులు అప్పన్న, లక్ష్మీ కన్నీరుమున్నీరవుతుండగా వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆర్మీ జవాన్‌ పార్థివ దేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చునని సమాచారం.

చదవండి: తల్లీకొడుకుల కన్నీటి చితి 

మరిన్ని వార్తలు