స్టేట్‌ లెవెల్‌ బాక్సింగ్‌ ప్లేయర్‌, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో..

17 May, 2022 08:36 IST|Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఆయన ఒకప్పుడు స్టేట్‌ లెవెల్‌ బాక్సింగ్‌ ప్లేయర్‌. స్పోర్ట్స్‌ కోటాలోనే పోలీసు ఉద్యోగం. కుమారుడు కూడా పోలీసే. కొడుకు కూతురికి వివాహాలు అయిపోయాయి. బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు. బయట నుంచి చూసే వారికి ఏ సమస్యలు లేని జీవితం ఆయనది. కానీ ఏం జరిగిందో గానీ ఒక్కసారిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఎందరివో సమస్యలు చూసిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఏ కష్టం గురించి మదనపడ్డారో గానీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రిపాడు సుబ్బారావు (50) సోమ వారం ఎచ్చెర్ల పోలీస్‌క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసు వర్గాలు విస్మయానికి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. 

సుబ్బారావు సోమవారం ఉదయం 5.45 సమయానికి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా ప్లంబర్‌ విధుల్లో భాగంగా పోలీస్‌ క్వార్టర్సులో వాటర్‌ స్కీమ్‌ ద్వారా నీరు విడిచిపెట్టారు. అనంతరం రోల్‌ కాల్‌కు వెళ్లారు. దాని తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో పోలీస్‌ క్వార్టర్సులో 8వ లైన్‌లో శిథిల క్వార్టర్‌లోకి వెళ్లి తాడుతో శ్లాబ్‌ హుక్‌కు ఊరి పోసుకున్నారు. డ్యూటీ నుంచి బయటకు వెళ్లిన సుబ్బారావు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి సిబ్బంది అనుమానంతో పరిశీలించగా ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానిక సిబ్బంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ అధికారులకు విషయం తెలుపగా.. వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఎస్పీ జీఆర్‌ రాధిక, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు మృతదేహాన్ని తరలించారు. 

మానసిక ఆందోళనే కారణమా..? 
సుబ్బారావుకు ఆర్థిక సమస్యలేవీ లేవు. అ యితే ఇటీవల కుటుంబ కలహాలు సమస్యగా మారినట్టు సమాచారం. భార్య వీరమ్మకు అనారోగ్యం చేసి మంచానికే పరిమితం కావడం, మద్యం అలవాటు వంటివి ఆయనలో మానసిక ఆందోళనకు దారి తీశాయి. ఇవే ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయని సహచరులు భావిస్తున్నారు. ఈయన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ క్రీడాకారుడు. క్రీడా కోటాలో 1992లో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. మెళియాపుట్టి మండలం బండపల్లి సొంత ప్రాంతం కాగా, తోటపాలేం పంచాయతీ తవిటయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుమారుడు రాజారావు సైతం ప్రస్తు తం ఎస్టీటీఎఫ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అల్లుడు కూడా ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Tamil Nadu: విద్యార్థుల గ్రూపు వివాదాలు.. ఏకంగా కత్తులతో..

మరిన్ని వార్తలు