విషాదం: కుమార్తె కళ్లెదుటే తల్లి మృత్యుఒడిలోకి.. 

1 Aug, 2021 17:38 IST|Sakshi

సాక్షి, ఇచ్చాపురం( శ్రీకాకుళం): కుమార్తె కళ్లెదుటే తల్లి మృత్యుఒడి చేరింది. ఈ ఘోరం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద శనివారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. బోరుబద్ర సరస్వతి తనువుచాలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిటి మండలం ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన బోరుబద్ర మోహన్‌రావు, ఆమె భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కూలి పనులు చేసుకుంటూ ఒడిశాలోని బరంపురంలో నివాసముంటున్నారు.

వీరు రెండు నెలలకొకసారి స్వగ్రామం వచ్చి వెళ్తుంటారు.ఈ క్రమంలోనే శుక్రవారం డ్వాక్రా గ్రూపు పనుల నిమిత్తం తల్లీకుమార్తెలు ద్విచక్ర వాహనంపై ప్రగడపుట్టుగకు వచ్చి పనులు పూర్తి చేసుకున్నారు. శనివారం తిరిగి బరంపురం వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కుమార్తె స్వాతి డ్రైవింగ్‌ చేస్తుండగా తల్లి సరస్వతి వెనుక కూర్చున్నారు. పురుషోత్తపురం అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోగా.. సరస్వతి తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

స్వాతి తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం పెద్దాస్పత్రికి రిఫర్‌ చేశారు. మృతురాలి భర్త  ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు.

మరిన్ని వార్తలు