జువెలరీలో ‘కిలేడీ’లు.. చూస్తుండగానే రెండు కిలోల వెండిని లోదుస్తుల్లో దాచి...

26 Nov, 2021 08:02 IST|Sakshi

రణస్థలం(శ్రీకాకుళం): ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి రెండు కేజీల వెండితో గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారు. రణస్థలంలోని శ్రీ కనకదు ర్గా జ్యూయలర్స్‌ దుకాణంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. షాపు యజమాని కెల్ల జగన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు కలిసి దుకాణానికి ఆభరణాలు కొనేందుకని వచ్చారు.

వెండి పట్టీలు, ఇతర వస్తువులను పావుగంట సేపు పరిశీలించారు. ఈలోగా ఓ మహిళ వెండి పట్టీలను పరిశీలించినట్లుగా నటించి చాకచక్యంగా రెండు కిలోల వెండిని లోదుస్తుల్లో పెట్టింది. పక్కనే ఉన్న వ్యక్తి మిగతా పట్టీలను సరిచేసి యజమానికి ఇచ్చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు జత పట్టీలు రూ. 4500, కాలి మట్టెలు రూ.500కు కొనుగోలు చేసి వెళ్లిపోయారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి దుకాణం యజమానికి అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలు పరిశీలించగా వెండిని సదరు వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పరిసర ప్రాంతాల వారికి తెలియజేయగా అప్పటికే వారు పరారయ్యారు. జె.ఆర్‌.పురం ఏఎస్‌ఐ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది

మరిన్ని వార్తలు