వెలుగు చూస్తున్న ‘సృష్టి’ నిర్వాకాలు

31 Jul, 2020 11:06 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పసికందులతో వ్యాపారం సాగించిన విశాఖపట్నం యూనివర్సల్‌ సృష్టి ఆసుపత్రి మోసాలు హైదరాబాద్‌లో కూడా బయటపడ్డాయి. అద్దె గర్భం (సరోగసీ) విధానంలో సంతానం అందజేస్తామని మోసం చేశారంటూ జూబ్లీహిల్స్ కి చెందిన దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు పిల్లలు కలగకపోవడం సరోగసీ ద్వారా సంతానం పొందాలని భావించి గత ఏడాది నవంబర్‌ 11న సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను సంప్రదించారు.

ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ నమ్రత సరోగసీ విధానంలో శిశువును అందజేస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సరోగసీ మహిళ విశాఖపట్టణంలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారని బాధితులు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరులో శిశువును ఇవ్వాల్సి ఉంది. అయితే విశాఖపట్నంలోని ఇదే ఆసుపత్రి శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంతో అనుమతులు లేకుండా తమను మోసం చేస్తున్నట్లు గ్రహించిన ఆ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు