గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. ఎమ్మెల్యే నివాసంలో సిబ్బంది ఆత్మహత్య

25 Sep, 2023 14:08 IST|Sakshi

లక్నో: ప్రియురాలితో గొడవపడి బీజేపీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. శ్రేష్టా తివారీ అనే 24 ఏళ్ల యువకుడు లక్నోలోని బక్షి కా తలాబ్‌ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే యోగేష్‌ శుక్లా వద్ద మీడియా సెల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు రావడంతో దూరం పెరిగింది.

ఈ క్రమంలో శ్రేష్టా తివారీ ఆదివారం హజ్రత్‌గంజ్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఉండగా.. తన ప్రియురాలితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ప్రేయసికి వీడియో కాల్‌ చేసి మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయన్ని గుర్తించిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. అలాగే ఆమె కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే తలుపులు లోపలి నుండి లాక్ చేయడంతో ఎంత కొట్టిగా డోర్స్‌ తీయలేదు. చివరికి పోలీసులు చేరుకొని తలుపులు  పగలగొట్టి చూడగా.. తివారీ శవమై కనిపించాడు.

అయితే ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఫ్లాట్‌లో తివారీ ఒంటరిగా ఉన్నారని పోలీసులు తెలిపారు.సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోటు లభించలేదని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ పాండే పేర్కొన్నారు. తివారీ తన గర్ల్‌ఫ్రెండ్‌కు కి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని, కావున ఆమె మొబైల్‌ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. 
చదవండి: సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు

మరిన్ని వార్తలు