గోల్డెన్‌ జూబ్లీ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సీబీఐ కేసు

2 Apr, 2021 08:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఓ వ్యాపార సంస్థ బ్యాంకులను రుణాల పేరిట మోసం చేసింది. దాదాపు రూ.1,285 కోట్ల మేరకు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక సమీపంలో ఉన్న గోల్డెన్‌ జూబ్లీ హోటల్స్‌ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ సంస్థకు శేరిలింగంపల్లికి చెందిన లక్ష్మీనారాయణశర్మ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సీఈవోగా, డైరెక్టర్లుగా ఢిల్లీకి చెందిన అర్జున్‌సింగ్‌ ఒబెరాయ్, నేహా గంభీర్, గచ్చిబౌలికి చెందిన యశ్‌దీప్‌శర్మలు ఉన్నారు.

వీరంతా కలిసి తమ సంస్థ వ్యాపారాభివృద్ధికి రుణం కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాను ఆశ్రయించారు. అడిగిన రుణం భారీగా ఉండటంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తనతో పాటు యూబీఐ, కెనరా బ్యాంక్, జమ్మూ కశ్మీర్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలతో కలిసి కన్సార్షియంగా ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకుల కన్సార్షియానికి బ్యాంక్ ‌ఆఫ్‌ బరోడా నేతృత్వం వహించింది. 2009 నుంచి 2015 వరకు వివిధ దశల్లో గోల్డెన్‌ జూబ్లీ హోటల్స్‌ సంస్థ రూ.వందల కోట్ల రుణాలు పొందింది. ఈ రుణాలను అక్రమ మార్గంలో ఇతర సంస్థ లకు మళ్లించినట్లు గుర్తించారు. వీరి చర్యలతో కన్సార్షియానికి మొత్తంగా రూ. 1,285.45 కోట్లు నష్టం వాటిల్లింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ అక్రమాలన్నీ వెలుగు చూశాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ( చదవండి: కరోనా డెంజర్ బెల్స్‌.. నాలుగు రోజుల్లోనే డబుల్!

మరిన్ని వార్తలు