అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ

5 Dec, 2022 19:36 IST|Sakshi

రొంపిచర్ల(గుంటూరు జిల్లా): తుంగపాడు బస్టాండ్‌ సమీపంలో శనివారం రాత్రి జరిగిన యువతి అదృశ్యం కథ సుఖాంతమైంది. యువతి పరారైందన్న భయంలో యువకుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలతో పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఎట్టకేలకు యువతి సురక్షితంగా ఉందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈపూరు మండలం ఇనిమెళ్లకు చెందిన యువకుడు, రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యువతి ఐదేళ్లుగా ప్రేమించకుంటున్నారు. ఇద్దరూ కలిసి బైక్‌పై వస్తుండగా తుంగపాడు బస్టాండ్‌ సమీపంలోని సుబాబుల్‌ తోటల వద్ద యువతి బైక్‌ దిగి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది.

ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో యువతి సుబాబుల్‌ తోటల్లోకి పరారైంది. యువకుడు ఎంతసేపు వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భయపడి ఏం చేయాలో పాలుపోని యువకుడు యువతిని కొందరు కిడ్నాప్‌ చేసి సుబాబుల్‌ తోటల్లోకి లాక్కెళ్లారని బాటసారులకు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, రూరల్‌సీఐ భక్తవత్సల రెడ్డి,  ఎస్‌ఐ సురేష్‌బాబులు తమ సిబ్బందితో ఘటనా చేరకుని సుబాబుల్‌ తోటను జల్లెడ పట్టారు.

ఓ దశలో యువకుడు యువతిని హత్య చేశానని చెప్పడంతో మృతదేహం ఆచూకీ కోసం రాత్రంతా వెతికారు. ఎంతకీ లభించకపోవడం, యువకుడు పదేపదే పొంతన లేని మాటలు చెబుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో ఆరా తీస్తే యువకుడు అసలు విషయం బయటపెట్టాడు.  ఎట్టకేలకు తన కోసం సుబాబుల్‌ తోటలో వెతుకుతున్న విషయం తెలుసుకున్న ఆ యువతి నేరుగా డీఎస్పీకి ఫోన్‌ చేసి తాను సురక్షితంగా ఉన్నానని, తన కోసం వెతకవద్దని, తానే పోలీస్‌స్టేషన్‌కు వస్తానని సమాచారం ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన యువతి రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. తర్వాత యువతి, యువకులు తామిద్దరం వివాహం చేసుకుంటామని పోలీసులకు తెలిపారు. దీంతో ఇద్దరి కుటుంబ పెద్దలతో పోలీసులు మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.
చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు    

మరిన్ని వార్తలు