స్ట్రీట్‌ ఫైట్‌ కేసు: నిందితుల అరెస్టు 

9 Jun, 2021 06:35 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ గజరావు భూపాల్‌ 

చాంద్రాయణగుట్ట: రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ యువకుడి మృతికి  దారి తీసిందని డబీర్‌పురా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నలుగురిని అరెస్టు చేయడంతో పాటు మరో ఇద్దరు మైనర్లను మంగళవారం జువైనల్‌ హోంకు తరలించారు. పురానీహవేలిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ వివరాలు వెల్లడించారు.

చంచల్‌గూడకు చెందిన సయ్యద్‌ ఖాజా మోహినుద్దీన్‌ కమ్రాన్‌ అలియాస్‌ కమ్రాన్, సయ్యద్‌ నజీబ్, సయ్యద్‌ ముస్తఫా ముజీబ్, అబ్దుల్లా, మరో ఇద్దరు మైనర్లు స్నేహితులు. వీరి స్నేహితుడైన సయ్యద్‌ అబ్బాస్‌ అనే యువకుడు ముజీబ్‌ సమక్షంలో దూషించాడు. తరచూ ఇలాగే దూషిస్తున్నాడనే విషయం తెలుసుకున్న అబ్దుల్లా ఈ విషయమై అబ్బాస్‌ను ప్రశ్నించాలని డబీర్‌పురా ఫర్హత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అద్నాన్‌ అనే స్నేహితుడితో చెప్పడంతో ఈ నెల 6న రాత్రి 7 గంటల సమయంలో అబ్బాస్, అబ్దుల్లా గ్రూపులు చంచల్‌గూడ న్యూ రోడ్డులోని అర్షద్‌ అలీ ఆస్పత్రి సమీపంలో కలుసుకున్నాయి.

ఈ క్రమంలో మాటా మాటా పెరిగి పరస్పరం ఘర్షణకు దారితీసింది. నజీబ్‌ అనే యువకుడు అద్నాన్‌ను  కొడుతుండగా.. కమ్రాన్‌ కూడా అద్నాన్‌ తల వెనుక భాగంలో పిడి గుద్దులు కురిపించాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయిన అద్నాన్‌ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతన్ని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అద్నాన్‌ మంగళవారం ఉదయం మృతి చెందాడు. డబీర్‌పురా పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: ప్రగతి భవన్‌ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం


 

మరిన్ని వార్తలు