గేమ్స్, చాటింగ్‌.. తల్లిదండ్రులు మందలించడంతో..

3 Dec, 2021 09:00 IST|Sakshi

సాక్షి, నిజాంపేట్‌: మొబైల్‌ ఫోన్‌ వాడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నిజాంపేట్‌ బండారి లేఅవుట్‌లో నివాసముండే రామకృష్ణ, దీప్తీల కుమారుడు వినీత్‌ (14) విజ్ఞాన్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు.

చదవండి: (Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన)  

ఇటీవల ఫోన్‌లో ఎక్కువగా గేమ్స్, చాటింగ్‌ చేస్తుండటంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు కుమారుడిని మందలించారు. దీంతో అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లాడు. రోజు మాదిరిగానే వాకింగ్, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో 9.45 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌పై ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ మీద నుండి బాలుడు వినీత్‌ కిందకు దూకడంతో తలకు తీవ్రగాయమైంది. బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..)

మరిన్ని వార్తలు