తొందరపాటు నిర్ణయం.. ఆలస్యంగా ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించడంతో

29 Nov, 2022 13:30 IST|Sakshi

నల్గొండ: చదువులో వెనుకబడి పోతున్నావని, పాఠశాలకు సక్రమంగా వెళ్లాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాకు చెందిన ధారావత్‌ సైదులు, అరుణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్దకుమార్తె వివాహం కాగా, స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రెండో కుమార్తె, వేదశ్రీ (15) పదో తరగతి, మూడో కుమార్తె (6వ), చిన్నకుమారుడు (5వ) తరగతులు చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు.  

ఆలస్యంగా ఎందుకు వెళ్తున్నావని..
మండల కేంద్రంలోని పాఠశాలకు సుల్తాన్‌పూర్‌తండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు ముగ్గురు పాఠశాల బస్సులోనే వెళ్లి వస్తుంటారు. అక్రమంలో సోమవారం బస్సు వచ్చే వేళకు వేదశ్రీ తయారుకాలేదు. అప్పటికే తయారైన చిన్న కుమార్తె, కుమారుడు బస్సులో పాఠశాలకు వెళ్లారు. దీంతో తల్లిదండ్రులు వేదశ్రీని పాఠశాలకు ఎందుకు ఆలస్యంగా వెళుతున్నావు, చదువులోకూడా వెనుబడి పోతున్నావంటూ మందలించారు.  మనస్తాపానికి గురైన వేదశ్రీ ఆటోలో పాఠశాల వద్దకు చేరుకుని బయటనే నిల్చుని ఉంది. గమనించిన తోటి విద్యార్థులు తరగతి గదికి రమ్మని కోరగా తాను పెన్నులు కొనుక్కుంటానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది.

 అయితే, వేదశ్రీ క్లాస్‌రూమ్‌లో లేకపోవడంతో ఉపాధ్యాయులు తండ్రి ధారావత్‌ సైదులుకి ఫోన్‌ చేసి వాకబు చేశారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల సమీపంలోని అటవీప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. సాయంత్రానికి వేదశ్రీ పాఠశాలకు వెనుక భాగాన ఉన్న కృష్ణానదిలో విగతజీవురాలై తేలడంతో స్థానికులు గుర్తించి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.  వేదశ్రీ మృతితో పాఠశాల, తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

మరిన్ని వార్తలు