ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. 

9 Feb, 2021 00:09 IST|Sakshi
రేణుక (ఫైల్‌ ఫొటో)

సూసైడ్‌ నోట్‌ రాసి విద్యార్థిని ఆత్మహత్య 

సాక్షి, వికారాబాద్‌: ‘నాకు ఇప్పుడే పెళ్లి వద్దు.. నేను చదువుకుంటా.. నా మాట వినకుండా మీరు సంబంధాలు చూస్తున్నారు. లేనిపోని నిందలు వేస్తున్నారు’ అంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్‌నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన సంపంగి వెంకటమ్మ, నర్సింహులు దంపతులకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మృతి చెందారు. నాలుగేళ్ల క్రితం తల్లి వెంకటమ్మ కూడా మృతి చెందింది. దీంతో కూతురు రేణుక (14) పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో ఉన్న అమ్మమ్మ అనంతమ్మ వద్ద ఉంటోంది.

అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం టీచర్లు పాఠ్య పుస్తకాలను కూడా అందజేశారు. అయితే రేణుకకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కొంత కాలంగా సంబంధాలు చూస్తున్నారు. బాలిక వద్దని వారించినా వారు సంబంధాలు చూస్తుండటం.. లేనిపోని నిందలు వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో సూసైడ్‌నోట్‌ రాసి ఇంటి దూలానికి ఉరేసుకుంది. ‘అమ్మమ్మా.. నన్ను క్షమించూ.. నిందలు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   

చదవండి: (ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక)

మరిన్ని వార్తలు