అవే చివరి పలకరింపులు.. ఇంటర్‌ పరీక్షలు ముగించుకొని బైక్‌పై వెళ్తూ..

20 May, 2022 14:35 IST|Sakshi
రాజేశ్వరి(ఫైల్‌) నల్లన్న (ఫైల్‌)  

ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. హాస్టల్‌లో తన వస్తువులు సిద్ధం చేసుకొని మరోసారి మిత్రులందరినీ పలకరించి నాన్నతో పాటు ఆనందంగా బైక్‌పై గ్రామానికి బయల్దేరింది. కానీ.. ఆ విద్యార్థిని ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోయింది. దారి మధ్యలోనే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి, కూతురిని బలితీసుకుంది. ఇక సెలవంటూ స్నేహితురాళ్లకి.. ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్‌లో విద్యార్థిని చెప్పిన ఆ పలకరింపులే.. చివరివయ్యాయి. 

సాక్షి, గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలిలా.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న (42), పద్మమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తె రాజేశ్వరి (18) గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం ఇంటర్మీడియెట్‌ చివరి పరీక్ష సైతం పూర్తవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద, హాస్టల్‌లో తోటి విద్యార్థినులతో ఆనందంగా పలకరిస్తూ.. తిరిగి పైచదువులకు కలుద్దామని చెప్పింది. కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి నల్లన్న బైక్‌పై మునగాల నుంచి గోనుపాడులోని కేజీబీవీ హాస్టల్‌కు చేరుకున్నాడు. స్నేహితులందరికీ మరోసారి పలకరించిన రాజేశ్వరి తండ్రితో పాటు బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరింది.  

బస్సు రూపంలో కబళించిన మృత్యువు.. 
గురువారం మధ్యాహ్నం తండ్రీకూతురు ఇద్దరూ గద్వాల మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎర్రవల్లి నుంచి గద్వాల వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌ పైనుంచి వారు ఎనిమిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన నల్లన్న, రాజేశ్వరి అక్కడిక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా, బైక్‌ మామూలు వేగంతోనే వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు డ్రైవర్‌ ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు.  
 చదవండి: దిశ కేసు: వారిని పోలీసులే వేధించి కాల్చి చంపారు

గ్రామంలో విషాదం. 
రోడ్డు ప్రమాదంలో మునగాలకి చెందిన తండ్రీకూతురు మృతి చెందారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. రాజేశ్వరి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ.. సెలవుల సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి బతుకీడుస్తున్న నల్లన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇరువురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు ఏఎస్‌ఐ వెంకట్రాములు తెలిపారు. 

మరిన్ని వార్తలు