విద్యార్థి ప్రాణం తీసిన మొబైల్‌.. స్కూల్‌కు సెల్‌ఫోన్‌ తీసుకొచ్చాడని..

1 Nov, 2022 02:06 IST|Sakshi

స్కూల్‌కు ఫోన్‌ తెచ్చినందుకు విద్యార్థిని 12 రోజులు సస్పెండ్‌ చేసిన ప్రిన్సిపాల్‌

మనస్తాపంతో రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య 

సికింద్రాబాద్‌: స్కూల్‌కు సెల్‌ఫోన్‌ను తీసుకొచ్చాడని విద్యార్థిని.. ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌ చేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్‌గిరి ఆర్‌కే పురంలోని గాంధీనగర్‌కు చెందిన కొండా దినేష్‌ రెడ్డి (15) ఏఓసీ సెంటర్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

సోమవారం ఉదయం దినేష్‌ రెడ్డి పాఠశాలకు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్‌ పద్మజ వెంటనే దినేష్‌ను మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ తెచ్చినందుకు 12 రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఇదే విషయం విద్యార్థి తండ్రి రమణారెడ్డికి కూడా చెప్పి విద్యార్థిని అతడితోపాటు పంపారు. ఇంటికి వెళ్లిన దినేష్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై.. సోమవారం సాయంత్రం అమ్ముగూడ స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు