పరీక్ష కేంద్రంలో పురిటినొప్పులు

29 Apr, 2022 10:17 IST|Sakshi

డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన సంచలనం సృష్టించింది.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి. గుంటగన్నెల పంచాయతీ జాముగుడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈమె ఆరోగ్యం బాగులేకపోవడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు.

టెన్త్‌ పరీక్షలు రాసేందుకు ఆమెను ఈనెల 27న మండల కేంద్రం డుంబ్రిగుడలోని పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో పరీక్ష కేంద్రం నుంచి హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈవో భారతరత్నం గురువారం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించారు.

ఈ ఘటనపై విచారణ జరిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థిని గర్భం దాల్చి ప్రసవించడంపై ప్రత్యేకాధికారి జ్యోతి, వసతిగృహ నిర్వాహకురాలు (టీచర్‌) అప్పలమ్మకు అధికారులు చార్జి మెమో జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి వివరాలతో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణకు నివేదిక అందజేస్తామని ఎంఈవో భారతరత్నం తెలిపారు.    

(చదవండి: దారిలోనే పసివాడిన బతుకు)

మరిన్ని వార్తలు