ఈ విద్యార్థులకేమైంది!... చిన్న విషయాలకే మనస‍్తాపం చెంది...

22 Jul, 2022 08:15 IST|Sakshi

ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే విద్యార్థులు విషాద గీతికలను ఆలపిస్తున్నారు. గోరంతలను కొండంతలుగా ఊహించుకుని ఊపిరి తీసుకుంటున్నారు. చిన్న విషయానికే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తల్లిదండ్రు అశనిపాతంలా పరిణమిస్తున్నాయి. మంగళవారం నాగోల్‌లో 6వ తరగతి విద్యారి్థని వర్షిత అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మరువకముందే గురువారం సైదాబాద్‌లో ఓ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఓల్‌బోయిన్‌పల్లిలో పన్నెండో తరగతి చదువుతున్న బాలిక పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

వ్యూస్‌ రావడం లేదని.. 
సైదాబాద్‌: ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ విద్యార్థి అపార్టుమెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. క్రాంతినగర్‌లోని ఆదర్శ్‌ అపార్టుమెంట్స్‌లో నివసించే చంద్రశేఖర్‌ రైల్వే ఉద్యోగి. అతని భార్య కేంద్ర రక్షణ రంగ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుమారుడు ధీనా (23) గ్వాలియర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. గురువారం తెల్లవారుజామున ధీనా నగరంలోని తాము నివసించే రెండో అంతస్తు నుంచి అపార్టుమెంట్‌ అయిదో అంతస్తు పైకి చేరుకొని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ధీనా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడని తెలుస్తోంది. అతను సెల్ఫో పేరుతో యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. తనకు తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శనం లేదని, తన యూట్యూబ్‌ చానల్‌కు వీక్షకులు తగ్గుతున్నారని భావించేవాడు. తన వీడియోలకు స్పందన కూడా సరిగా రావడం లేదని మనస్తాపం చెందుతున్నాడని సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆయన తెలిపారు.  తనకు జీవితంపై విరక్తి కలుగుతోందంటూ ఆత్మహత్యకు ముందు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది.  

విదేశాలకు పంపించలేదని.. 
కంటోన్మెంట్‌: స్కూలు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ విద్యార్థిని. బోయిన్‌పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌ జయచంద్రా రావు కుమార్తె స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతోంది. గురువారం  స్కూలు రెండో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గమనించిన స్కూలు యాజమాన్యం వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక సోదరుడు కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా, తాను కూడా అక్కడే చదువుకుంటానని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు వారించగా, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. బిల్డింగ్‌ పై నుంచి కిందకు దూకడానికి ముందు తన తండ్రికి సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపినట్లు తెలుస్తోంది.  

వర్షిత ఆత్మహత్యపై విచారణ  
నాగోలు: ఎల్‌బీనగర్‌ పరిధిలోని చంద్రపురి కాలనీలో మంగళవారం అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వర్షిత (12) కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని గురువారం ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిన్నారి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం  చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంటి పరిసరాల్లో ఉండే వారిని విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం వచ్చిందని తెలిపారు.     

(చదవండి: ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు