అక్రమ రిజిస్ట్రేషన్లు.. సబ్‌ రిజిస్ట్రార్, తహసీల్దార్‌ అరెస్టు

9 Oct, 2022 05:30 IST|Sakshi
తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తా

మరో ముగ్గురు వీఆర్‌వోలు కూడా..

ఇదే వ్యవహారంలో గత నెలలో ఏడుగురి అరెస్టు

ఒకరి పేరుతో ఉన్న భూములకు వారికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్లు

చిత్తూరులో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు

సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ

చిత్తూరు అర్బన్‌/చిత్తూరు కార్పొరేషన్‌: ఓ స్థలానికి సంబంధించి యజమాని ఒకరైతే.. వాళ్లకే తెలియకుండా మరొకరి పేరిట రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను గత నెలలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తహసీల్దార్‌ ఐ.సుబ్రహ్మణ్యం, సబ్‌ రిజిస్ట్రార్‌ జె.శ్రీధర్‌ గుప్తా, వీఆర్‌వోలు ధనుంజయ, ఎం.శివనారాయణ, కె.బాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువ చేసే భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో సురేంద్రబాబు తదితరులు ఓ ముఠాగా ఏర్పడి వేరేవారికి కట్టబెట్టారు. దీంతో సురేంద్రబాబుతో పాటు మొత్తం ఏడుగురిని సెప్టెంబర్‌ 30న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని అక్రమాలు జరిగినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయించారు. 

అక్రమాలు బయటపడింది ఇలా..
చిత్తూరుకు చెందిన బాలగురునాథంకు చెందిన ఐదెకరాల స్థలాన్ని సురేంద్రబాబు ముఠా.. యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినైజర్, పూపతమ్మ, మురళి, శివకుమార్, చిట్టిబాబు, చిత్తూరుకు చెందిన నితీష్‌కు రూ.75 లక్షలకు అమ్మేశారు. తాము మోసపోయామని, ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా విలువైన స్థలాలను తమకు రిజిస్ట్రేషన్‌ చేసి ఏమార్చారని ఎబినైజర్‌ గత నెల 25న యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసును విచారించిన పోలీసులు ఎబినైజర్‌ కొన్న స్థలం బాలగురునాథంకు చెందిందిగా గుర్తించారు. ఈ భూమిని గ్రామకంఠం భూమిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో రెండేళ్ల క్రితం చిత్తూరు తహసీల్దార్‌గా పనిచేసి, ప్రస్తుతం పుత్తూరు తహసీల్దార్‌గా ఉన్న ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు వీఆర్‌వోలు ధనంజయ, కె.బాబు, శివనారాయణ కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అలాగే రిజిస్ట్రేషన్‌ శాఖలో ఈకేవైసీ చేయడం, ఉద్యోగుల లాగిన్, పాస్‌వర్డ్‌తోపాటు ప్రభుత్వ సమాచారాన్ని దళారులకు ఇవ్వడంలో ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టయిన ప్రభుత్వ అధికారులు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో నగదు రూపేణా లబ్ధి పొందినట్టు ఆధారాలు సేకరించారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని, మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రిషాంత్‌ రెడ్డి తెలిపారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు..
చిత్తూరు అర్బన్‌ జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తాను సస్పెండ్‌ చేస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ డీఐజీ గిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పందించిన ఆయన జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో శ్రీధర్‌ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చిత్తూరు దాటివెళ్లవద్దని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు