ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌

8 Dec, 2021 04:26 IST|Sakshi
సబ్‌ రిజిస్ట్రార్‌ జేవీవీ ప్రసాద్‌

రూ.1.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు  

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్‌ రిజిస్ట్రార్‌ జమ్ము వెంకట వరప్రసాద్‌ కార్యాలయం, ఇల్లు, తదితర ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆత్రేయపురంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు రాజమహేంద్రవరంలోని ఆయన ఇల్లు, కాకినాడ, విజయవాడ, తెలంగాణలోని మేడ్చల్‌ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన, కుటుంబ సభ్యుల పేరిట రెండు ఫ్లాట్లు, ఒక భవనం, రెండు ఇళ్ల స్థలాలు, ఒక కారు, మోటార్‌ సైకిల్, బంగారం, విలువైన ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, భారీగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ మొత్తం రూ.2.5 కోట్లు ఉంటుందని తేల్చారు. వరప్రసాద్‌ దాదాపు రూ.1.4 కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. విశాఖపట్నానికి చెందిన వరప్రసాద్‌ తండ్రి సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ 1982లో మరణించారు.

కారుణ్య నియామకం కింద వరప్రసాద్‌ 1989లో ఆ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. గత ఆగస్టు నుంచి ఆత్రేయపురం సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. అక్రమ ఆస్తుల నేపథ్యంలో వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఇన్‌చార్జ్‌ అడిషనల్‌ ఎస్పీ సౌజన్య, డీఎస్పీ రామచంద్రరావు, సీఐ పుల్లారావు, తిలక్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు