సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర

5 Sep, 2021 08:07 IST|Sakshi
అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం (ఇన్‌సెట్‌లో) సబ్‌ రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారి

ప్రభుత్వ భూముల అడ్డగోలు రిజిస్ట్రేషన్‌

తొమ్మిది నెలల్లో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు

వెలుగులోకి సబ్‌ రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారి లీలలు

శాఖాపరమైన విచారణకు డీఐజీ ఆదేశం 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని కొడిమి గ్రామ సర్వే నంబరు 227లో ఐదు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఇందులోని సెంటు స్థలానికి కూడా రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ సబ్‌ రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారి  ఐదు ఎకరాల స్థలంలో ఏకంగా వందకు పైగా డాక్యుమెంట్లను అక్రమంగా రిజిష్టర్‌ చేశారు. ఆయన అక్రమాల పర్వం అనంతపురం రూరల్‌ మండలానికే పరిమితం కాలేదు. కార్యాలయ పరిధిలోని రాప్తాడు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు మండలాలకూ విస్తరించింది. అందినకాడికి దండుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు.

డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కై.. 
సురేష్‌ ఆచారి అనంతపురం రూరల్‌ ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా గత ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు 13 వరకు పనిచేశారు. ఈ మధ్య కాలంలోనే అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కై విలువైన ప్రభుత్వ, అసైన్డ్, దేవదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ రిజిష్టర్‌ చేశారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి సర్వే నంబరు 123లోని 4.17 ఎకరాల వంక పోరంబోకును ఇతరుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వైనంపై ఈ నెల 1న ‘సాక్షి’లో  కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆ శాఖ డీఐజీ మాధవి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దీంతో సురేష్‌ ఆచారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

9 నెలల్లో 999 అక్రమ రిజిస్ట్రేషన్లు 
అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్‌ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్‌ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చట్ట సవరణ జరిగితేనే..  
డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించేలా చట్టంలో సవరణలు చేస్తేనే రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి తగ్గుముఖం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అధికారులు కెమెరా కళ్లకు       చిక్కకుండా అక్రమాలు కొనసాగిస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌ నిర్వహించే ప్రక్రియ అంతా రికార్డు అవుతుంది. క్రయ విక్రయదారులు అధికారి వద్దకు వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో కూడా రికార్డు అవుతుంది. కానీ సబ్‌ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్‌ రైటర్ల సహకారంతో కార్యాలయం బయటే తతంగమంతా నడిపిస్తున్నారు. తద్వారా సీసీ కెమెరాలకు దొరక్కుండా  తప్పించుకుంటున్నారు.

అక్రమాలను ఉపేక్షించం  
రిజిస్ట్రేషన్‌ శాఖలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను తప్పుడు విధానంలో రిజిస్ట్రేషన్‌ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రసన్నాయపల్లి సర్వే నంబరు 123–2లోని ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసినందుకే సబ్‌రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారిని సస్పెండ్‌ చేశాం. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడిన హిందూపురం, ఉరవకొండ, చెన్నేకొత్తపల్లి సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేశాం.   
–ఎన్‌.మాధవి, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ

ఇవీ చదవండి:
పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని..  
వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ

మరిన్ని వార్తలు