ఏసీబీకి చిక్కిన సూగూరు వీఆర్వో

7 Aug, 2020 12:29 IST|Sakshi
నగదుతో వీఆర్వో వెంకటరమణ

ఆన్‌లైన్‌లో పొలం వివరాలు ఎక్కించేందుకు  రూ.10వేలు డిమాండ్‌  

రూ.6వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం 

పెబ్బేరు: మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం సూగూరు వీఆర్వో వెంకటరమరణ రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.  సూగూరుకి చెందిన రైతులు ఆడెం ఆంజనేయులు, ఆడెం భాగ్యమ్మ, ఆడెం మద్దిలేటి, ఆడెం బాల్‌రాంలకు 2ఎకరాల 19గుంటల భూమి ఉంది. భాగ పరిష్కారాల అనంతరం వేర్వేరుగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మూడు డాక్యుమెంట్ల జిరాక్స్‌లతో తమ పొలాలకు ఆర్వోఆర్, పాసుబుక్కులు ఇవ్వాలని జూలై 14న తహసీల్దార్‌ కార్యాలయంలో ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే వీఆర్వో వెంకటరమణ ఈ పని చేసేందుకు రూ.10వేలు డిమాండ్‌ చేశాడు. ఆంజనేయులు రూ.6 వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు రైతుకు డబ్బులిచ్చి అతని వద్దకు పంపారు. వీఆర్వో వెంకటరమణ రైతు వద్ద నగదు తీసుకుని  పంపించాడు. కార్యాలయం బయట ఉన్న ఏసీబీ డీఎస్పీ  క్రిష్ణయ్యగౌడ్, ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌లు వెంటనే కార్యాలయంలోకి వెళ్లి వీఆర్వో తీసుకున్న డబ్బులను పరిశీలించారు. నోట్లకు, అతని చేతులు, ప్యాంట్‌ జేబుకు పింక్‌ కలర్‌ ఉండటాన్ని గుర్తించారు. విచారణ చేసి వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.దాడుల్లో ఏసీబీ సిబ్బంది 10మంది ఉన్నారు.  

మరిన్ని వార్తలు