అప్పుల బాధతో కుటుంబమంతా ఆత్మహత్యాయత్నం

8 Dec, 2020 07:59 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ప్రాణాలతో బయపడిన తనయుడు

సాక్షి, కరీంనగర్‌క్రైం: ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్‌ పట్టణానికి వెళ్లిన కుటుంబ సభ్యులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో హుస్నాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన అందె సమ్మయ్య కృష్ణవేణి దంపతులు ఐదేళ్ల నుంచి జీవనోపాధి కోసం కరీంనగర్‌ వెళ్లారు. అప్పుల బాధతో ఆదివారం రాత్రి ఇంట్లో దంపతులతోపాటు కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.


బంధువుల కథనం ప్రకారం.. హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన అందె సమ్మయ్య(38)కు కూచనపెల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి(35)తో పన్నెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొద్దిరోజులు హుస్నాబాద్‌లో జీవనం సాగించిన వీరు జీవనోపాధి కోసం ఐదేళ్ల క్రితం కరీంనగర్‌కు వలస వెళ్లారు. అక్కడ అద్దె గదిలో ఉంటూ సమ్మయ్య మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చేసిన అప్పులు రూ.14లక్షలను తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్‌ నోట్‌ రాసి దంపతులిద్దరు పురుగుల మందును ఆహారంలో తీసుకొని, కుమారుడు లక్కీ(10)కి కూడా ఇచ్చారు.  చదవండి:  (ఫీజు చెల్లించలేక తనువు చాలించింది)

ఆహారం తీసుకొని నిద్రపోయిన దంపతులు ఇద్దరు సోమవారం తెల్లవారుజామున చావుబతుకుల మధ్యన కొట్టుకుండటం చూసిన కుమారుడు డయల్‌ 100కు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సమ్మయ్య, కృష్ణవేణి దంపతులు ఇద్దరు మృతి చెందగా, కుమారుడు లక్కీ ప్రమాదం నుంచి బయటపడ్డట్లు తెలిపారు. ఈ సంఘటన కరీంనగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనతో కృష్ణవేణి తల్లిగారు ఊరు అయిన కూచనపెల్లిలో, సమ్మయ్య సొంత ఇల్లు ఉండే హుస్నాబాద్‌ గాంధీ చౌరస్తాలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని బాలుడికి భవిష్యత్‌ చూపించాలని రెండు గ్రామాల గ్రామస్తులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు