Sujana Chowdary: చెన్నై ఈడీ కోర్టుకు మాజీ ఎంపీ సుజనాచౌదరి

13 Aug, 2022 03:24 IST|Sakshi
ఫొటో తీయవద్దంటున్న సుజనాచౌదరి

సాక్షి, చెన్నై: బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ, బీజేపీ నేత సుజనాచౌదరి శుక్రవారం చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టుకు హాజరయ్యారు. 20 నిమిషాల విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి వెళ్లిపోయారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌ల నుంచి తన సంస్థలకు రుణాలు పొందేందుకు సుజనాచౌదరి అడ్డదారులు తొక్కినట్లు వచ్చిన ఆరోపణలతో గతంలో ఈడీ రంగంలోకి దిగింది.

ఆయన రూ.400 కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేసినట్లు బెంగళూరులోని ఆర్థికనేరాల పరిశోధన విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసు చెన్నై జిల్లా కలెక్టరేట్‌ సమీపంలోని ఈడీ కోర్టులో విచారణలో ఉంది. గతంలో ఇదే కోర్టు విచారణకు సుజనాహాజరు కావడం, ఈ కేసులో అరెస్టు, క్షణాల్లో బెయిల్‌ వ్యవహారాలు జరిగిపోవడం వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో కోర్టు సమన్ల మేరకు శుక్రవారం 11 గంటల సమయంలో మళ్లీ అదే కోర్టు విచారణకు సుజనాచౌదరి హాజరయ్యారు. తన న్యాయవాదులు, ముఖ్య సన్నిహితులతో కలిసి కోర్టులోకి వెళ్లారు. 20 నిమిషాల పాటు కోర్టు న్యాయాధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్టు సమాచారం. అనంతరం ఆగమేఘాలపై బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. ఈ సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ఆయన ఫొటోలు, వీడియో చిత్రీకరించే యత్నం చేయగా తన చేతులను అడ్డుపెట్టుకున్నారు. ఆయన్ను ప్రశ్నించే యత్నం చేయగా.. మౌనంగా వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు