నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి

10 May, 2021 02:40 IST|Sakshi
మృతి చెందిన సునీత

మా నాన్నను అన్యాయంగా జైలుకు పంపారు 

నా కుటుంబాన్ని కూడా చంపేందుకు చూస్తున్నారు 

సూసైడ్‌ నోట్‌ రాసి యువతి ఆత్మహత్య

సాక్షి, బయ్యారం: ‘ప్రేమించిన పాపానికి నాపై లైంగిక దాడికి యత్నించారు. కిడ్నాప్‌ కూడా చేయబోయారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న మా నాన్నను అన్యాయంగా జైలుకు పంపారు. నాతో పాటు నా కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి సారూ. అమ్మా.. నాన్నా మీరు క్షేమంగా ఉండటం కోసం నేను వెళ్లిపోతున్నా’.. అంటూ ఓ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం పత్యాతండాలో చోటుచేసుకుంది. సూసైడ్‌నోట్‌లో మృతురాలు పేర్కొన్న వివరాలు ప్రకారం... పత్యాతండాకు చెందిన ధర్మసోత్‌ సునీత (20), అదే తండాకు చెందిన మాళోత్‌ శివ ప్రేమించుకున్నారు. ఈ విషయం శివ తల్లిదండ్రులకు తెలియడంతో వారు సునీత బంధువులతో అసభ్యకరంగా మాట్లాడారు.

ఇంట్లో ఎవరూ లేని సమయం లో శివ సైతం సునీతపై లైంగిక దాడికి యత్నించాడు. కుదరకపోవడంతో సునీతను కిడ్నాప్‌ చేయడానికి చూశాడు. విషయం సునీత తన తండ్రి బిచ్చకి, సర్పంచ్‌ కి తెలిపింది. దీంతో సునీత తండ్రి .. శివతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గత నెల 24న పోలీస్‌ స్టేషన్‌ కు బయలుదేరాడు. అయితే పథకం ప్రకారం శివ అతని బంధువులు సునీత తండ్రిని అడ్డుకున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి బిచ్చనే జైలుకు పంపించారు. ఆధారాలు లేవన్న కారణంతో శివకు సంబంధించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. బిచ్చ జైలుకు వెళ్లడంతో సునీత కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన సునీత ‘శివతో పాటు అతని బంధువులు తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుతోనైనా వారిని జైలుకు పంపాలని సూసైడ్‌ నోట్‌ లో పేర్కొంది.  చదవండి: (భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..) 

న్యాయం చేయాలని ఆందోళన.. 
కాగా, సునీత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె బంధువులు బయ్యారం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

8 మందిపై కేసు నమోదు 
యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మాళోత్‌ శివతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతురాలు సూసైడ్‌ నోట్‌లో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని ఆరోపించటంపై ఎస్సైను వివరణ కోరగా, తమకు వచ్చిన ఫిర్యాదుపై తండాలో విచారణ నిర్వహించామని, కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు.   

మరిన్ని వార్తలు