Markapuram Lodge: పాముల శాపం.. కుటుంబం బాగుండాలనే ఆమె ఆత్మహత్యాయత్నం!?

30 Apr, 2022 13:30 IST|Sakshi

ప్రకాశం: మార్కాపురం లాడ్జిలో యువతి ఆత్మాహత్యయత్నం కేసులో విస్మయానికి గురి చేసే విషయం వెలుగు చూసింది. చదువుల తల్లి అయిన ఆ విద్యార్థిని.. పిచ్చిగా మూఢనమ్మకంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిశాక తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం షాక్‌ తిన్నారు. 

ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది సదరు యువతి. పరీక్షలు అయిపోవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. అయితే ఇంటికని చెప్పి బయలుదేరిన ఆమె.. మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏప్రిల్‌ 27వ తేదీన బసచేసింది. అక్కడి నుంచి ఆమె తన తండ్రికి సూసైడ్‌ నోట్‌ వాట్సాప్‌ చేసి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయన సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. 

ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె అసాధారణమైన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నం వెనుక ఒక బాబా ప్రమేయం ఉందని తెలిపింది. ఇంతకీ ఆ బాబా ఏం చెప్పాడంటే.. ఆమె కుటుంబానికి పాము పగ పట్టిందని, దాని వెనుక ఉంది ఆమెనే అని. గతంలో ఆమె నీడ పడి రెండు పాములు రక్తం కక్కుకుని చచ్చిపోయాయట. వాటి పగతో శాపం తగిలిందని, ఆమె కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆ బాబా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమె బలంగా నమ్మింది.

ఇదంతా తన వల్లే అనుకుంది. అందుకే నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది.  ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ  వైద్యశాలకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బతికింది. ఇంత చదువు చదివి.. ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోవడమేంటంటూ ఆమెకు కౌన్సెలింగ్‌ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు