సుశాంత్‌ కేసు సీబీఐకే

20 Aug, 2020 02:50 IST|Sakshi

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

రియాపై కేసు సహా అన్నిటిపైనా దర్యాప్తు చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అసహజ మరణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. నటి రియా చక్రవర్తిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ సహా కేసులన్నిటి విచారణను సీబీఐకే అప్పగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిభావంతుడు, ఎంతో భవిష్యత్తున్న సుశాంత్‌ సింగ్‌ అసహజ మరణంపై ‘న్యాయ, సమర్థనీయ, నిష్పాక్షిక దర్యాప్తు తక్షణావసరం’అని వ్యాఖ్యానించింది.

ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ బిహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సరైందేనని పేర్కొంది. తన కుమారుడు సుశాంత్‌ మృతికి నటి రియా చక్రవర్తి మరో ఆరుగురు కారణమంటూ అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పట్నా పోలీసులు కేసు నమోదు చేయడం కూడా చట్టపరిధిలోనే జరిగినట్లు తెలిపింది. పట్నా పోలీసులు తనపై పెట్టిన కేసును ముంబైకి బదిలీ చేయాలని ఆదేశించాలంటూ సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం బుధవారం తన తీర్పులో పలు విషయాలను ప్రస్తావించింది.

‘బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుని ఈ కేసును రాజకీయం చేశాయి. దీంతో ఈ కేసు దర్యాప్తులో చట్టబద్ధతపై నీలినీడలు కమ్ముకున్నాయి. రియా చక్రవర్తి కూడా సీబీఐ దర్యాప్తును కోరినందున, ఆమెకు కూడా న్యాయం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు కూడా ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని తెలుస్తోంది. అయితే, పట్నా పోలీసు బృందాన్ని అడ్డుకోవడం ద్వారా వారి దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నిజం వెలుగులోకి రాదని, బాధితులకు న్యాయం జరగదని అందరూ భావించడం కూడా సహేతుకమే. అందుకే, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం. ‘నిజం వెలుగు చూసినప్పుడు, సజీవులకే కాదు, క్షోభకు గురైన వారికి, మృతులకు కూడా న్యాయం దొరుకుతుంది. వారి ఆత్మ శాంతిస్తుంది. సత్యమే జయిస్తుంది’అని ధర్మాసనం పేర్కొంది. సుశాంత్‌ రాజ్‌పుత్‌(34) జూన్‌ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా