టీడీపీ నేతకు సుప్రీం కోర్టు షాక్‌ 

27 Aug, 2020 08:14 IST|Sakshi

కదిరి: డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్‌ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరితో పాటు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. కింది కోర్టులో శిక్ష పడిన వ్యక్తి.. తీర్పును సవాల్‌ చేస్తూ పైకోర్టుకు వెళ్లినప్పుడు ఆ కేసు విచారణలో ఉండగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం  సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక నకిలీ డీడీలకు సంబంధించిన కేసు హైకోర్టులో పరిష్కారమయ్యే వరకు కందికుంట వెంకటప్రసాద్‌ సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయరని ఆయన తరఫు న్యాయవాది ఎస్‌.బసంత్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. 

ఇదీ కేసు.. 
హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు డీడీలు తస్కరించి రూ.8.29 కోట్లు కాజేశారనే కేసులో సీబీఐ కోర్టు కందికుంటకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా వి«ధించింది. అలాగే హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఉన్న ఎస్‌బీఐ హుస్సేన్‌ ఆలం బ్రాంచ్‌లో కూడా నకిలీ డీడీలకు సంబంధించి మరో రూ.3.20 కోట్లు మోసగించారంటూ  సీబీఐ కోర్టు కందికుంటకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కందికుంట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై కదిరికి చెందిన న్యాయవాది అబుబాకర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా దీనిపై సీబీఐ ఎందుకు ఆక్షేపణ తెలియజేయలేదంటూ వారికి కూడా నోటీసు జారీ చేసింది. అప్పుడు సీబీఐ కూడా మరో పిటిషన్‌ దాఖలు చేసింది. రెండింటినీ ఒకటిగా స్వీకరిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం పైవిధంగా తీర్పు వెలువరించింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా