సుశాంత్ కేసు : ఎన్‌సీబీ అధికారికి పాజిటివ్

16 Sep, 2020 13:27 IST|Sakshi

అర్ధాంతరంగా  నిలిచిన విచారణ

మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీ వెనక్కి

సాక్షి, న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణకు కరోనా సెగ తాకింది. ఎన్‌సీబీ దర్యాప్తు బృందంలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో విచారణను అర్దాంతరంగా నిలిపివేశారు అధికారులు.  నిర్దేశించిన ప్రోటోకాల్  ప్రకారం ఇతర సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి చర్యల అనంతరం మళ్లీ దర్యాప్తు మొదలుకానుందని ఎన్‌సీబీ సీనియర్ అధికారి  తెలిపారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) బృంద సభ్యుల్లో ఒకరికి బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీని ప్రశ్నించడం అకస్మాత్తుగా ఆగిపోయింది. శ్రుతి మోడీని దర్యాప్తును ప్రస్తుతానికి నిలిపివేశామని, ఆమెను తిరిగి పంపించామని  ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోడీతోపాటు, టాలెంట్ మేనేజర్ జయ సాహా పేర్లు బహిర్గతమైన తరువాత ఎన్‌సీబీ వీరిపై దృష్టి పెట్టింది. వీరిని ప్రశ్నించేందుకు బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రుతి దక్షిణ ముంబైలోని ఎన్‌సీబీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. కానీ తాజా పరిణామంతో ఈమెతోపాటు, సాహా విచారణ కూడా ప్రస్తుతానికి వాయిదా పడింది. (డ్రగ్స్‌ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్‌)

కాగా జూన్14న సుశాంత్ అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుకు సంబంధించి అనేక కీలక పరిణామాల మధ్య డ్రగ్స్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు  రియాపై ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియా చక్రవర్తి,  ఆమె సోదరుడు షోయిక్, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా  సహా పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు