ఏకే రావు ఉదంతంలో అనేక అనుమానాలు.. ఆత్మ‘హత్యా’? 

27 Nov, 2021 12:36 IST|Sakshi

హత్యగా చెబుతున్న ఘటనాస్థలంలోని ఆధారాలు

ఆత్మహత్యగా పేర్కొంటున్న ఫోరెన్సిక్‌ వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌: సుజనా ఫౌండేషన్‌ సీఈఓ, సినీ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. ఘటనాస్థలిలోని ఆధారాలు ఇది హత్య అనడానికి అనుమానాలు కలిగిస్తుండగా... కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సిటీ రైల్వే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శివకుమార్‌ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో నివసించే ఏకే రావు గతంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు డైరెక్టర్‌గా పని చేశారు.
చదవండి: సింగర్‌ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’

బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారికి ఫిర్యాదు మేరకు అక్కడి సుద్ధగుంటపాళ్య పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుతో రావుకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో నిందితులుగా ఉన్న ముగ్గురితో రావు సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ నెల 13న బెంగళూరు వెళ్లిన ఏకే రావు అక్కడి అశోక్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న ది చాన్సరీ పెవిలియన్‌ హోటల్‌లో బస చేశారు. ఆఖరుసారిగా ఈ నెల 19న కుటుంబీకులతో మాట్లాడారు. సోమవారం రాత్రి క్యాబ్‌ బుక్‌ చేసుకున్న అతను హోటల్‌ నుంచి యలహంక రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ క్యాబ్‌ దిగిన ఆయన ఆ తర్వాత ఆదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం యలహంక రైల్వేస్టేషన్‌ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన లోకో పైలెట్‌ యలహంక రైల్వేస్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు.
చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే

ఆయన సిటీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని పరిశీలించిన పోలీసులు ఎడమ చేతి మణికట్టపై రెండు కత్తిగాట్లు, మెడకు ఎడమ వైపు మరో గాటు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం పక్కనే ఓ కత్తి, బ్లేడ్‌తో పాటు రెండు కత్తెరలను స్వాధీనం చేసుకున్నారు. నరాలు కోసుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే ఆ మూడింటిలో ఏదో ఒకటి తీసుకుని వస్తారని, అయితే ఇన్ని రకాలైనవి ఎందుకు తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్‌స్పెక్టర్‌ వి.శివకుమార్‌ శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఏకే రావు కుమార్తె శాలినీ రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశామన్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్‌ వైద్యులు ప్రాథమికంగా ఆత్మహత్యగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన నివేదిక రెండుమూడు రోజుల్లో వస్తుంది. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. సుద్ధగుంటపాళ్య పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు ఫిర్యాదుదారుడినీ ప్రశ్నిస్తున్నాం’ అని తెలిపారు. మరోపక్క ఏకే రావు కుటుంబం శ్రీనగర్‌కాలనీలో నివసిస్తోందని తెలిసిందని, అంతకు మించి తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు