అయ్యో పాపం.. వర్షిత 

20 Jul, 2022 07:17 IST|Sakshi

నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి అపార్టుమెంట్‌లోని నాలుగో అంతస్తుపై నుంచి కింద పడి అసువులు బాసిన ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి, ప్రభావతి దంపతులు. మన్సూరాబాద్‌లోని మధురానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి ప్రైవేట్‌ టీచర్‌. సత్యనారాయణ రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.

రెండో కూతురు వర్షిత (12) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చిప్స్‌ కొనుక్కుంటానని తల్లి వద్ద రూ.20 తీసుకుని బయటకు వెళ్లింది. మన్సూరాబద్‌ చౌరస్తాకు వచ్చి ఆటో డ్రైవర్‌కు రూ.50 ఇచ్చి ఎల్‌బీనగర్‌లోని చంద్రపురి కాలనీలోని రోడ్డు నంబర్‌–2లో ఉన్న ఓ అపార్టుమెంట్‌ వద్దకు వచ్చిది. అపార్టుమెంట్‌ పైకి వెళ్తుండగా అక్కడి వాచ్‌మన్‌ ఎవరు కావాలని అడగటంతో ‘మా నాన్న ఇక్కడే ఉన్నాడు’ అంటూ నాలుగో అంతస్తుపైకి వెళ్లింది.

అప్పటికే అనుమానం వచ్చిన వాచ్‌మన్‌ చిన్నారి వెనుక అతని కొడుకును లిఫ్ట్‌లో పంపించాడు. పైకి వెళ్లి వెతికినా వర్షిత జాడ కనపించలేదు. కొద్ది సేపటి తర్వాత బాలిక కింద పడిన శబ్దం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఎల్‌బీనగర్‌ పోలీసులకు అపార్టుమెంట్‌ వాచ్‌మన్‌ సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. చిన్నారి అక్కడికి ఎందుకు వచ్చింది? అపార్టుమెంట్‌లో ఎవరు ఉన్నారు? నాలుగో అంతస్తుపై నుంచి తానే దూకిందా? వేరే ఎవరైనా బాలికను కిందకు తోశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి:  డీఎస్పీ హత్య.. నిందితుడ్ని గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ గాయం)

మరిన్ని వార్తలు