బ్యూటీషియన్‌ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?

19 Apr, 2023 10:54 IST|Sakshi
దుర్గా ప్రశాంతి (ఫైల్‌)

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని మంగళవారం ఓ బ్యూటీషియన్‌ చనిపోవడం.. పక్కనే ఆమె స్నేహితుడు రక్తపుమడుగులో పడి ఉండటం సంచలనం సృష్టించింది. ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉండటంతో యువతి గొంతు కోసి చంపి.. ఆ తర్వాత ఆమె స్నేహితుడు గొంతు, ఛాతి, చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని తొలుత భావించారు. అయితే, పోలీసులు వచ్చి క్షు­ణ్ణంగా పరిశీలించిన తర్వాత మృతురాలి శరీరంపై ఎక్కడా చిన్నగాయం కూడా కనిపించలేదు.

యువతిని ఆమె స్నేహితుడు గొంతు నులిమి చంపేసి, అనంతరం అతను బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, మృతురాలి కు­టుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చి­త్తూరు నగరంలోని తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం.

కుమారుడు 15 ఏళ్ల క్రితం విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడు. పెద్ద కుమార్తెకు ఏడాది క్రితం పెళ్లి చేశారు. రెండో కుమార్తె దుర్గాప్రశాంతి(23) ఎం.ఫా­ర్మసీ పూర్తిచేసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతకా­లం పనిచేసింది. ఆమె ఏడాది క్రితం హైదరా­బాద్‌కు వెళ్లి బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుంది. నా­లుగు నెలల క్రితం చిత్తూరులోని కొండమిట్ట ప్రాంతంలో సొంతగా బ్యూటీపార్లర్‌ ప్రారంభించింది.

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై..
దుర్గాప్రశాంతికి రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో చక్రవర్తి (27) అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనిది తెలంగాణలోని భద్రాచలం జిల్లా కొత్తగూడెం కాగా, రెండేళ్లు దుబాయ్‌లో వంట మాస్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే చక్రవర్తికి, దుర్గాప్రశాంతికి ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహం కుదిరింది. రెండు నెలల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన చక్రవర్తి.. తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నగరంలోని దర్గా కూడలిలో బ్రెడ్‌ ఆమ్లెట్‌ దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్నాడు.

ఇతని తల్లి, దుర్గాప్రశాంతి తల్లి ఇందిర కూడా స్నేహితులుగా మారారు. రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి కాణిపాకం వినాయకస్వామి ఆలయానికి కూడా వెళ్లి వచ్చారు. దుర్గాప్రశాంతి బ్యూటీపార్లర్‌ వద్దకు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చక్రవర్తి వచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇందిర వచ్చి బ్యూటీపార్లర్‌ తలుపు తీసి చూడగా.. దుర్గాప్రశాంతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది.

చక్రవర్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు ఘటనాస్థలానికి చేరుకుని చక్రవర్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గాప్రశాంతి అప్పటికే చనిపోయి ఉంది. చక్రవర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద దుర్గాప్రశాంతి మృతదేహాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి పరిశీలించి ఘటనపై ఆరా తీశారు.
చదవండి: 'నేను  డేంజర్‌లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్‌.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. 

ఇప్పుడే పెళ్లి వద్దంటూ..
దుర్గాప్రశాంతికి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల ఒక సంబంధం చూశారు. అబ్బాయి వైద్యుడు అని, పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే, ఏడాది తర్వాత పెళ్లి గురించి చూద్దామని దుర్గాప్రశాంతి చెప్పింది. ఈ నేపథ్యంలో చక్రవర్తి, దుర్గాప్రశాంతికి మధ్య ఏదైనా గొడవ జరిగి.. ఆమె గొంతు నులిమి చంపేసి, అతను బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్గాప్రశాంతి ఆత్మహత్య చేసుకుందనడానికి ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు