సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి 

22 Aug, 2021 04:08 IST|Sakshi
గదిలో విగతజీవిగా పడి ఉన్న సింధు

ప్రేమ విఫలమై మానసిక క్షోభతో బలవన్మరణం 

ప్రియుడే చంపాడని మృతురాలి తండ్రి ఫిర్యాదు 

హత్య కోణంలోనూ దర్యాప్తు 

గుణదల (విజయవాడ తూర్పు) :  ప్రేమ వివాహం జరగకపోగా ప్రియుడు తన నుంచి దూరమయ్యాడనే మనస్తాపంతో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణాజిల్లా తిరువూరు మండలం, రాజుగూడెం గ్రామానికి చెందిన చెరుకూరి సింధు (29) గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఉంటోంది. సీఏ చదువుకుంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ప్రసేన్‌ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. కానీ,  ప్రసేన్‌ కుటుంబ సభ్యులు వారిద్దరి ప్రేమ వివాహానికి నిరాకరించారు.

సింధు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు.. సింధు, ప్రసేన్‌ మధ్య కూడా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. దీంతో సింధు విజయవాడ గుణదల ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. అటు సొంత కుటుంబ సభ్యులు, ఇటు ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె  మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో.. జీవితంపై విరక్తి చెంది తాను ఉంటున్న గదిలోనే ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజులుగా సింధు ఉన్న గది తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రులు విజయవాడ చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. 

ప్రసేనే పొట్టన పెట్టుకున్నాడు 
తన కూతురు ఉరి వేసుకుని చనిపోయేంత పిరికి వ్యక్తి కాదని.. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రసేనే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని సింధు తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయనన్నారు. సింధు మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. సింధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే తాను ఉరికి వేలాడకుండా నేలపై ఎలా పడిఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, సింధు తలభాగం నుంచి రక్తం కారడంతో ప్రసేన్‌ హత్యచేసి ఉంటాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు