బాయ్స్‌ హాస్టల్‌ నిర్వాహకురాలి మృతి.. అతనిపైనే అనుమానం!

17 Nov, 2022 07:58 IST|Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఇంటికి వేసిన తలుపులు వేసినట్టుగానేఉన్నాయి. లోపలకు ప్రవేశించేందుకు మరొకరికి అవకాశం లేదు. అయినా ఓ వివాహిత హత్యకు గురైంది. నాలుగు నెలలైనా ఈ కేసులో మిస్టరీ వీడలేదు.  

ఏం జరిగిందంటే..  
అనంతపురంలోని జీసస్‌ నగర్‌లో నివాసముంటున్న బయపురెడ్డి, సుజాత దంపతులు. బాయ్స్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డికి ఈ ఏడాది ఆగస్టు 14న గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన నిహారికరెడ్డితో వివాహమైంది. అదే నెల 24న రాత్రి కొడుకు, కోడలితో సరదాగా ముచ్చటించిన తర్వాత సుజాత తన గదిలోకి వెళ్లి నిద్రకుపక్రమించింది. మరో గదిలో కొడుకు, కోడలు నిద్రపోయారు. సుజాత తండ్రి సైతం రోజూ మాదిరిగానే ఇంటి బయట తలుపునకు తాళం వేసి వరండాలో నిద్రించాడు. ఇంటి వెనుక తలుపునకు లోపలి నుంచి గడియ పెట్టారు.

ఉదయం కొడుకు విష్ణువర్దన్‌రెడ్డి నిద్ర లేచి హాల్‌లోకి వచ్చేసరికి తల్లి కనిపించలేదు. మొక్కలకు నీళ్లు పోసేందుకు మేడపైకి వెళ్లి ఉంటుందనుకుని తన పనిలో నిమగ్నమయ్యాడు.  ఈలోపు ఇంటి ముందు తలుపు తాళం తీసుకుని తాత లోపలకు వచ్చాడు. ఎంతసేపటికీ సుజాత కనిపించక పోయేసరికి అందరిలో ఆందోళన మొదలైంది. వెనుకవైపు తలుపు తీసేందుకు ప్రయత్నిస్తే రాలేదు. బయట గడియ పెట్టినట్లుగా ఉంది. దీంతో ప్రహరీ ఆవరణలో నుంచి ఇంటి వెనుకకు వెళుతుండగా విగతజీవిగా పడి ఉన్న సుజాత కనిపించింది. మెడకు ఉరి బిగించి చంపినట్లుగా తెలుస్తోంది.  

బాధ్యులు ఎవరు? 
సుజాత హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది మిస్టరీగానే ఉంది. నాలుగు నెలలుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తొలుత కుమారుడిని పరిపరివిధాలుగా ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు ఇంట్లోకి ఎవరైనా రావాలంటే ఇంటి వెనుక ఉన్న తలుపు ఎవరో ఒకరు తీసి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలోనే కుమారుడిని విచారణ చేశారు. విష్ణువర్దన్‌రెడ్డి వివాహ సమయంలో పుట్టింటి వారు సుజాతకు ఒడి బియ్యం పెట్టారు. ఆ సమయంలో సంప్రదాయాన్ని అనుసరించి ఆమె మెడలో పసుపు తాడు వేశారు. అయితే విగతజీవిగా పడి ఉన్న సుజాత మెడలోని పసుపు తాడుకు పసుపు కొమ్మ కట్టి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం అంతు చిక్కడం లేదు.   

డబ్బు కోసమేనా? 
సుజాత, బయపురెడ్డి దంపతుల మధ్య లోపించిన సఖ్యతను బాయ్స్‌ హాస్టల్‌ వ్యవహారాలు చక్కబెట్టేందుకు వచ్చిన ఓ వ్యక్తి తెలివిగా సొమ్ము చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే సుజాతను లోబర్చుకుని పెద్ద మొత్తంలో  డబ్బు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెతో ఘర్షణకు దిగాడు. బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తుండడంతో ఆ వ్యక్తిని సుజాత దూరం పెట్టింది. రెండేళ్లకు పైగా అతని జాడ లేదు. ఉన్నఫళంగా విష్ణువర్దన్‌రెడ్డి పెళ్లిలో అతను ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో తన డబ్బు ఎలాగైనా సర్దుబాటు చేయాలని అతనికి సుజాత సూచించింది. అందుకు అతను గడువు కోరాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బు వెనక్కు ఇవ్వడం ఇష్టం లేక ఆ వ్యక్తే సుజాతను హతమార్చి ఉంటాడా? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

అవమాన భారం తాళలేకా?  
సుజాత హత్య వెనుక మరో యువకుడి ప్రమేయాన్ని సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. సుజాత వ్యవహారం తెలిసిన ఓ యువకుడు కొన్ని నెలల క్రితం ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీనిపై అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె చెప్పు తీసుకుని ఆ యువకుడిని కొట్టింది. అనంతరం ఒత్తిళ్లకు తలొగ్గి కేసును ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అవమాన భారం తాళలేక సుజాతను  ఆ యువకుడు హతమార్చి ఉంటాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో రెండు మూడ్రోజుల్లో ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించనున్నారు.  

మరిన్ని వార్తలు