Swapnalok Fire Accident: ఏం జరగకూడదో మళ్లీ అదే జరిగింది? మేయర్‌ ఏం చెప్పారు.. అధికారులు ఏం చేశారు?

17 Mar, 2023 09:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనతో మరోసారి అధికారుల అలసత్వం బయటపడింది. డెక్కన్ మాల్ అగ్నిప్రమాద అనంతరం ఆగమేఘాల మీద టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయగా, రెండు మీటింగ్‌లకు మాత్రమే కమిటీ పరిమితమైంది.  అక్రమ గోదాంలను గుర్తించడంలో అధికారుల అలసత్వం వహిస్తున్నారు.

నగరంలో వేలల్లో అక్రమ గోదాములు ఉండగా, కనీస ఫైర్ నిబంధనలను భవన యాజమమానులు పాటించడం లేదు. హైదరాబాద్‌లో ఒక్క ఏడాదీలోనే అగ్నిప్రమాదాలకు ముప్పై మందికి పైగా మృతి చెందారు. భవన యజమానులకు కేవలం నోటీసులతోనే పరిమితం చేశారు..

సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో 4 పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు
సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో 4  భారీ అగ్రి ప్రమాదం జరగగా 4 చోట్ల 28 మంది మృతి చెందారు. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు.

గతేడాది మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందాగా, సికింద్రాబాద్‌ రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న ఫైర్ యాక్సిడెంట్‌లో 8 మంది మరణించారు. ఆ తర్వాత 4 నెలల్లోనే మరో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జనవరి 29న డెక్కన్ మాల్లో  మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లను ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. 

గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు.  వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్‌లలో కూడా చర్యలు తీసుకోలేదు. బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్‌గా ఉందా? లేదా అని మాత్రమే ఫోకస్ పెట్టారు. టాక్స్‌ కోసం పలుమార్లు తిరుగుతున్నప్పటికీ.. ఆ బిల్డింగ్ వాడకంపై మాత్రం అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి.

కాగా, సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతికష్టమ్మీద గ్రిల్స్‌ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు.

వీరికి సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్‌ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే! 

మరిన్ని వార్తలు