సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?

13 Dec, 2020 09:46 IST|Sakshi
స్వాతి (ఫైల్‌ ఫోటో)

దుండగుల దాడిలో గాయపడిన వివాహిత మృతి

పోలీసుల ముమ్మర దర్యాప్తు 

అదుపులో ఇద్దరు అనుమానితులు!

సాక్షి, శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బహిర్భూమి కోసం వెళ్లి శుక్రవారం రాత్రి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నపల్లివూరు గ్రామానికి చెందిన వివాహిత రచ్చ స్వాతి (24) ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉన్న ఉద్దానం ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివాహితతో సన్నిహితంగా ఉన్నట్టు భావిస్తున్న ఉద్దానం రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ఐదారుగురుని కూడా పోలీసులు స్టేషన్‌కు రప్పించి విచారణ చేపడుతున్నారు. స్వాతి వాడిన సెల్‌ ఫోన్‌ మాత్రం లభ్యం కాలేదు. ఫోన్‌ దొరికి.. కాల్‌ డేటా పరిశీలిస్తే నిందితులు పట్టుబడే అవకాశం ఉంది.  చదవండి: (పెళ్లింట విషాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం)

సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కుమార్తె స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కుమారుడు దినేష్‌తో 2017 ఆగస్టులో వివాహమైంది. వీరికి సుమారు మూడేళ్ల కుమారుడు సమర్పణ్‌ ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికని వెళ్లిన స్వాతి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకుంది. గొర్రెలు, ఆవులను మేత కోసం తీసుకొని వెళ్లిన ఆమె అత్తమామలు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటికి చేరగా.. అప్పటికే పొయ్యిపై అన్నం వండుతున్న స్వాతి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని గమనించి మందలించారు.


సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న కాశీబుగ్గ సీఐ శంకరరావు, ఎస్సై గోవిందరావు  
అనంతరం బహిర్భూమికి వెళతానని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో మామ అప్పన్న స్థానికులతో కలిసి తోటలో గాలించగా.. రక్తపు మడుగులో స్వాతి కనిపించింది. వెంటనే 108 వాహనంలో రాత్రి 9.30 గంటల సమయంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..)

సెల్‌ఫోన్‌ మాయం 
స్వాతి తల్లి రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. స్వాతి బహిర్భూమి కోసం వెళ్లిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన స్వాతి బంగారు చెవి దిద్దులు, చెప్పులు, జడ క్లిప్‌ సేకరించారు. అక్కడకు కాసింత దూరంలో రక్తపు మరకలతో పాటు ఖాళీ క్వార్టర్‌ మద్యం సీసాను కూడా క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసి స్థానిక ఎస్సై కూన గోవిందరావుకు అందించారు. అయితే హత్య జరిగిన స్థలంలో ఉండాల్సిన స్వాతి సెల్‌ఫోన్‌ మాత్రం కనిపించలేదు. ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. మరోవైపు పోలీసులు కాల్‌ డేటా సేకరించే పనిలో పడ్డారు.  

పోలీసులు ఏమన్నారంటే.. 
శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరకున్న వజ్రపుకొత్తూరు ఎస్సై కూన గోవిందరావు, కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు, క్లూస్‌ టీం వివరాలు సేకరించారు. క్రైమ్‌ జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మామ అప్పన్న ఆడపడుచు, అనుమానితులను విచారించారు. హంతకుల ఆనవాలు దొరకలేదని, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించినా ఫలితం లేకపోయిందని, అత్యాచారం జరిగినట్లు ఆనవాలు కూడా దొరకలేదని తెలిపారు. రిమ్స్‌లో పోస్టుమార్టం చేపట్టాక పూర్తి నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు