స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో

14 Mar, 2023 10:03 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్‌): స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో ఓ టైలర్‌ తన దుకాణంలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం కుళ్లి నీచునీరు బయటకు రావడం, దుర్ఘందం వెదజల్లుతుండటాన్ని గుర్తించిన స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని షర్టర్‌ పగులగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. పోస్టల్‌కాలనీ ఆరోవీధికి చెందిన పచ్చియప్పన్‌ రామస్వామి(48) – రాజేశ్వరి దంపతులు. వారికి సంతోష్‌కుమార్, ఐశ్వర్య సంతానం. ఆయన టైలరింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను కరెంటాఫీస్‌ సెంటర్‌లో టైలరింగ్‌ దుకాణం నిర్వహిస్తున్నప్పుడు చంద్రమౌళినగర్‌కు చెందిన కె.సుభాషిణి ఆయన వద్ద పనికి చేరారు. ఆమె భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది.

 ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఈ విషయమై రామస్వామికి, భార్య రాజేశ్వరికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయినా రామస్వామి ఇవేమీ పట్టించుకోలేదు. స్నేహితురాలి వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడు. అప్పుడప్పుడు భార్య, పిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు. స్నేహితురాలికి విద్యుత్‌భవన్‌ వద్ద పండ్ల వ్యాపారం పెట్టించాడు. దాని పక్కనే ఆయన టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. స్నేహితురాలి కుమారుడు, కోడలు ఆమంచర్లలో ఉంటున్నారు. వారు ఆర్థికంగా నష్టపోయి ఇటీవల తల్లి వద్దకు వచ్చారు. రామస్వామి సైతం వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు.

 అయితే గత కొద్దిరోజులుగా వారిని ఇంటి నుంచి పంపివేయాలని రామస్వామి స్నేహితురాలిపై ఒత్తిడి తేవడంతోపాటు విపరీతంగా కొట్టేవాడు. దీంతో ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో సుభాషిణి అతనిని దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రామస్వామి తన స్నేహితుడి ద్వారా సుభాషిణితో రాజీప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. శనివారం భార్య, పిల్లల వద్దకు వెళ్లి కొంతసేపు వారితో గడిపి అనంతరం షాపునకు వచ్చాడు. షాపులోనే మద్యం తాగి స్నేహితురాలి కోడలితో గొడవపడ్డాడు. షట్టర్‌ లోపల గడియపెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటాడని రాజేశ్వరి, తాను దూరం పెట్టడంతో భార్య వద్దనే ఉంటాడని స్నేహితురాలు భావించారు. 

సోమవారం సుభాషిణి పండ్ల షాపునకు వచ్చింది. రామస్వామి టైలరింగ్‌ షాపులో నుంచి నీచునీరు బయటకు రావడం, దుర్ఘంధం వస్తుండడాన్ని గమనించిన ఆమె దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్గామిట్ట ఏఎస్సై బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ భాస్కర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రామస్వామి భార్య, కుటుంబసభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో పోలీసులు షట్టర్‌ పగులగొట్టి చూడగా రామస్వామి ఉరేసుకుని ఉన్నాడు. మృతదేహం కుళ్లి తీవ్ర దుర్ఘంధం వెదజల్లుతూ ఉండడంతో శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. స్నేహితురాలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని రామస్వామి భార్య ఆరోపించింది. తన భర్త మృతిపై విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు