‘అప్పుడే నా కూతురిని తీసుకొస్తే ఇప్పుడు ప్రాణాలతో ఉండేది’

8 Jul, 2021 13:28 IST|Sakshi

వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని దారుణంగా హతమార్చారు. డబ్బుపై మొహంతో కట్టుకున్న భర్త, అత్తమామలలే కాలయములై వివాహితను కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ అమానుష ఘటన పంజాబ్‌ రాష్ట్రంలో మంగళరం వెలుగు చూసింది. లుధియానా జిల్లాలోని సమ్రాలా ప్రాంతంలో సురిందర్‌ పాల్‌ కుటుంబం నివాసముంటోంది. పాల్‌ తన కుమార్తె మణ్‌దీప్‌ కౌర్‌ను కాకోవాల్‌ మజ్రా గ్రామానికి చెందిన బలరాం సింగ్‌ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. 

పెళ్లైనప్పటి నుంచే మహిళపై అత్తాంటివారి వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల అదనపు కట్నం కావాలని మహిళపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం వివాహిత ఒంటినిండా కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన కూతురిని అత్తింటివారే చంపారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కూతురిని పుట్టింటికి తీసుకెళ్లకుంటే ఆమెను చంపేస్తామని అల్లుడు ముందుగానే హెచ్చరించాడని తెలిపాడు. ఒకవేళ తన కూతురిని ముందుగానే ఇంటికి తీసుకువచ్చినట్లయితే, ఆమె ఈ రోజు సజీవంగా ఉండేదని సురిందర్‌పాల్ కన్నీటి పర్యంతమయ్యారు.

‘అల్లుడి తండ్రి కాల్‌ చేసి నా కూతురికి కాలిన గాయాలయ్యాని, ఆమెను సివిల్‌​ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి నుంచి నా కూతురిని రాజీంద్ర హస్మిటల్‌కు రిఫర్‌ చేశారు. అక్కడికి వెళ్తుండగానే మధ్యలోనే నా కూతురు చనిపోయింది. నేను చివరికి నా కూతురు శవాన్ని చూడాల్సి వచ్చింది. ఆమె తలపై గాయాలు చూసి షాకయ్యాను. శరీరమంతా కాలిన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లైన అప్పటినుంచి అత్తారింటివారు తన కూతురిని కట్నం వేధింపులకు గురిచేసేవారని బాధితురాలి తండ్రి వాపోయాడు. ఆమె భర్త బలరాం, వాళ్ల తల్లిదండ్రులు కూతురిపై దాడికి పాల్పడుతున్నారు. మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీతో లేవనెత్తాము. గ్రామంలోని పంచాయతీ పెద్దలు సమస్యను పరిష్కరించారు. అయినా నా కుమార్తెకు అత్తమామల వేధింపులు తగ్గేలేదని మహిళ తండ్రి ఆరోపించారు. కాగా మన్‌దీప్ భర్త బలరాం సింగ్, బావ చంద్ సింగ్, అత్త రాజ్‌వంత్ కౌర్, బావ రాజ్‌వీందర్ కౌర్, బావమరిది కుల్బీర్ సింగ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు