బిగుతు దుస్తులు ధరించిందని యువతిని కాల్చేశారు..!

9 Aug, 2021 17:34 IST|Sakshi

కాబూల్‌:  అఫ్గానిస్తాన్‌ భూభాగంపై తాలిబాన్‌ ఆధిపత్యం రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో బిగుతు దుస్తులు ధరించిన ఓ యువతిని తాలిబన్లు కాల్చి చంపారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం... అఫ్గాన్‌ ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్‌లో ఓ యువతి బిగుతు దుస్తులు ధరించడమే కాకుండా మగ తోడులేకుండా వచ్చిందన్న కారణంతో తాలిబన్లు హత్య చేశారు. ఈ ఘటన తాలిబన్‌ నియంత్రణలో ఉన్న సమర్‌ ఖండ్‌ అనే గ్రామంలో చోటు చేసుకుంది. యువతి తన ఇంటి నుంచి మజార్-ఇ-షరీఫ్ వెళ్లడానికి వాహనం ఎక్కుతుండగా ఆమెపై దాడి జరిగింది. బాధితురాలిని నజానిన్(21) గా గుర్తించారు.

అయితే ఆమెపై దాడి జరిగినప్పుడు తను బుర్ఖా ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తాలిబన్ నియంత్రణలో నివసిస్తున్న అఫ్గాన్‌ మహిళలు బిగుతు దుస్తులు ధరించి బయట పని చేయవద్దని వారు హుకుం జారీ చేశారు. ఇక అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో.. తాలిబన్లు క్రమంగా అక్కడి భూభాగాలను ఆక్రమించుకుంటున్నారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్ రాజధానిలోని కొన్ని భాగాలను ఆదివారం తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు