బీర్‌ బాటిల్‌తో పొడిచి.. బైక్‌కు కట్టేసి.. 

11 Jul, 2022 09:44 IST|Sakshi

సాక్షి, చెన్నై: పెరంబలూర్‌ సమీపంలో ఇనుప దుకాణం యజమాని హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పెరంబలూర్‌ నార్త్, మల్లిగై నగర్‌కు చెందిన భరత్‌ కుమార్‌ అనే మగుడు రామ్‌ (35) ఇనుప దుకాణం నడుపుతున్నాడు. గత ఆరో తేదీ రాత్రి దుకాణం నుంచి బైక్‌లో బయటకు వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీనికి సంబంధించి ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

పట్టించిన గూగుల్‌ పే.. 
రామ్‌ ఫోన్‌లో నుంచి ఆన్‌లైన్‌లో కొంత నగదు బదిలీ జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గూగుల్‌ పేలో అరియలూర్‌కు చెందిన సంజయ్‌ రోషన్‌ (19)కి ఎక్కువ మొత్తంలో నగదు పంపినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కమల్‌ (25), కార్తీక్‌ (27) అనే ఇద్దరూ తనకు మరొక వ్యక్తి ఫోన్‌ నుంచి పంపినట్లు తెలిపారు. దీంతో కమల్, కార్తీక్‌ను పట్టుకుని పోలీసులు విచారణ చేయగా వారు ఇద్దరూ రామ్‌ను హత్య చేసి, అతని మృతదేహాన్ని అతని బైక్‌కు కట్టి పెరంబలూర్‌ ఎలంబూర్‌ మార్గంలోని అటవీ ప్రాంతంలోని ఒక బావిలో పడతోసినట్టు తెలిపారు. శనివారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామ్‌ మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్ష కోసం పెరంబలూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

దాడి చేసి.. ఫోన్‌ నుంచి అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ 
పోలీసులు మాట్లాడుతూ.. సంఘటన జరిగిన రోజు బైక్‌లో వస్తున్న రామ్‌ను కమల్, కార్తీక్‌ అడ్డుకుని దాడి చేశారు. సెల్‌ఫోన్‌ లాక్కుని కమల్‌ భార్య నిత్యా (25)కు రూ. 10 వేలు పంపించారు. దీంతో ఆగ్రహించిన రామ్‌ అక్కడున్న బీర్‌ బాటిల్‌ పగలగొట్టి కమల్‌ కడుపులోకి పొడిచాడు. స్నేహితుడిని పొడిచాడని ఆగ్రహించిన కార్తీక్‌ సమీపంలో ఉన్న మరో బీర్‌ బాటిల్‌ను పగులగొట్టి రామ్‌ గొంతులోకి పొడవడంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని కమల్, కార్తీక్‌ అతని బైకుకు కట్టి బావిలోకి తోసేశారు. తర్వాత అతని సెల్‌ఫోన్‌ నుంచి గూగుల్‌ పే ద్వారా రూ 1.70 లక్షలు సంజయ్‌ రోషన్‌కు పంపినట్లు తెలిసింది. దీంతో కమల్, కార్తీక్‌తో పాటు వారికి సహకరించిన వరదరాజన్‌ (30), నిత్య, సంజయ్‌ రోషన్‌ను అనే ముగ్గురిని అరెస్టు చేశారు.   

మరిన్ని వార్తలు