తమిళనాడులో మ‌రో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. రెండు వారాల్లో మూడో ఘ‌ట‌న‌

26 Jul, 2022 16:48 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. జూలై 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిన్నటికి నిన్న (సోమవారం) తిరువళ్లూరులోని ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌ గదిలో 12వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే  తాజాగా మరో మైనర్‌ విద్యార్థిని అసువులు బాసింది. కడలూరు జిల్లాలో 12వ విద్యార్థినిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు వారాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి.. 

బాధితురాలి నుంచి నాలుగు పేజీల సుసైడ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేశారు. అందులో తను ఐఏఎస్‌ కావాలన్న తల్లిదండ్రుల కోరికను నెరవేర్చలేకపోతున్నాని వాపోయింది. కాగా విద్యార్థిని తల్లిదండ్రులు వ్యవసాయ దారులు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి శక్తి గణేషన్‌ తెలిపారు. 
చదవండి: తమిళనాడులో ఘోరం.. విద్యార్థిని ఆత్మహత్య.. 10 రోజుల్లో రెండో ఘటన

ఇదిలా ఉండగా తొలుత కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్లస్‌-2 చదువుతున్న శ్రీమతి (17) అనే బాలిక హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో విద్యా సంస్థల్లో జరగుతున్న మరణాలపై సెంట్రల్‌ బ్యూరో సీఐడీతో విచారణ జరిపించాలని మద్రాస్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సోమవారం విద్యార్థిని ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు సెంట్రల్‌ బ్యూరో సీఐడీకి బదిలీ చేశారు. ఇదే కాక జూలై 13న కళ్లకురిచ్చి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసు కూడా విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో విద్యార్ధినిల ఆత్మహత్యలపై సీఎంస్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.  పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు