పారిపోతూ.. విధి నుంచి తప్పించుకోలేకపోయాడు

9 May, 2022 20:33 IST|Sakshi

ఏదో ఒకనాటికి.. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. తప్పించుకునే ప్రయత్నాలు ఫలించకపోగా.. కాలమే దానికి సరైన సమాధానం ఇస్తుంది కూడా. అలా ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ‘చెయిన్‌ స్నాచింగ్‌’ కారణమైంది.    

కేరళకు చెందిన ఇద్దరు యువకులు (17, 21 ఏళ్లు).. చెయిన్‌ స్నాచింగ్‌కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో వాళ్ల మీద 15 కేసులు నమోదు అయ్యాయి. ఆ భయంతో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పడి చెయిన్‌ స్నాచింగ్‌లకు పాల్పడడం.. వాటిని కేరళకు తెచ్చి అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేయసాగారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్యాకుమారి తుచ్కలిలో ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసు దొంగతనం చేశారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు వేగంగా బైక్‌ మీద వెళ్లిపోయారు. 

పోలీసులు జాలి పడ్డారట!
వేగంగా దూసుకెళ్తూ.. నరువమూడు(కేరళ) దగ్గర హైవే మీద డివైడర్‌ను ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యారు. తొలుత యాక్సిడెంట్‌ కేసుగా భావించిన పోలీసులు.. పాపం అనుకుని ఆస్పత్రిలో చేర్పించారు. బైక్‌ నడిపిన 17 ఏళ్ల కుర్రాడు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోగా.. మరో వ్యక్తికి కాలికి సర్జరీ అయ్యింది. అయితే వీళ్ల దగ్గర బంగారు గొలుసులు దొరకడంతో.. పోలీసులు రెండో వ్యక్తిని విచారించి అసలు విషయం రాబట్టారు.

అలా.. చెడు దారిలో వేగంగా వెళ్లిన ఆ యువకుడి జీవితం అర్ధాంతంగా ముగియగా.. నడవలేని స్థితికి చేరుకున్న మరో యువకుడు జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్చ్‌.. విధి ఎంత బలీయమైనదో కదా!

మరిన్ని వార్తలు