ఖైదీని చూడడానికి వెళ్లిన లాయర్‌ అరెస్టు.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే!

19 Mar, 2023 12:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చైన్నె): చైన్నె పుళల్‌జైలులో ఖైదీని చూడడానికి వెళ్లిన నకిలీ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సెంట్రల్‌ పుళల్‌లో సుమారు 3 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిని న్యాయవాదులు తరచూ వచ్చి సంప్రదించి వెళుతుంటారు. శుక్రవారం సాయంత్రం రామాపురం పెరియార్‌ రోడ్డుకు చెందిన సతీష్‌ కుమార్‌ (38) అనే వ్యక్తి ఖైదీని చూడడానికి వచ్చాడు. ఆ సమయంలో నడవడికలపై జైలర్‌కు అనుమానం రావడంతో గుర్తింపు కార్డు చూపించమని కోరాడు.

అది నకిలీదని, అతను న్యాయవాది కాదని తెలిసింది. అతనిపై జైలు అధికారులు పుళల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతన్ని పుళల్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పుళల్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ షణ్ముగం సంబంధిత వ్యక్తిని విచారిస్తున్నారు. అతను 2013లో తిరువేర్కాడులో జరిగిన హత్య కేసుకు సంబంధం ఉన్న వ్యక్తి అని తెలిసింది. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసి, అతని వద్ద ఉన్న నకిలీ న్యాయవాది ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాది పేరుతో ఇంకా ఎక్కడెక్కడ మోసం చేశాడన్న దానిపై విచారిస్తున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు