పరీక్షలో టాప్‌ వచ్చారు.. తీగ లాగితే డొంక మొత్తం కదిలింది!

15 Mar, 2023 12:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై (కొరుక్కుపేట): కోయంబత్తూరు–మేటుపాళయం రోడ్డులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ జన్యుశాస్త్ర ప్రచార సంస్థ పనిచేస్తోంది. ఇందులో వివిధ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కోయంబత్తూరులో ఈ నెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్ష రాసేందుకు వచ్చిన వారి ఫొటో, వేలిముద్రలను నమోదు చేశారు. ఈ సందర్భంలో రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపికైన వారికి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఆ సమయంలో పరీక్షకు హాజరైన నలుగురు అభ్యర్థుల ఫొటో, వేలిముద్రలు వేర్వేరుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులు నలుగురిని ఆంగ్లంలో రాయడం, మాట్లాడాలని కోరారు. వారు మాట్లాడలేకపోయారు. కానీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించారు. విచారణలో ఈ నలుగురు అభ్యర్థుల పేర్లతో వేరే వారు పరీక్ష రాసినట్లు గుర్తించారు. దీనిపై సాయిబాబా కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ డైరెక్టర్‌ కుని కణ్ణన్‌ మంగళవారం ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితులు హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్‌.అమిత్‌ కుమార్‌ (30), ఎస్‌.అమిత్‌ కుమార్‌ (26), వి.అమిత్‌ (23), సులైమాన్‌ (25) అని తేలింది. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు