తమిళ్‌సెల్వి అదృశ్యం కేసు విషాదాంతం.. అస్థిపంజర స్థితిలో మృతదేహం

1 Aug, 2022 08:59 IST|Sakshi
తమిల్‌సెల్వి, మదన్‌ (ఫైల్‌)

సాక్షి, చెన్నై/తిరుపతి: తమిళనాడుకు చెందిన తమిళ్‌సెల్వి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. నారాయణవనం కైలాసనాథకోన అడవిలో శవమై కనిపించింది. కట్నం కోసం వేధించి, అందుకు భార్య అంగీకరించిక పోవడంతో హత్య చేశాడు. ఆపై తప్పించుకోవాలని చూశాడు. తమిళ్‌సెల్వి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. వివరాలు ఇలా.. తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని పుజిల్‌కు చెందిన తమిళ్‌సెల్వి(18) ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. చెన్నై రెడ్‌హిల్స్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న మదన్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు.

కొంత కాలం పాటు సంసారం సజావుగా సాగింది. వరకట్నం తేవాలంటూ మదన్‌ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో జూన్‌ 25న తమిళ్‌సెల్విని తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసనాథకోనకు తీసుకొచ్చాడు. కత్తితో పొడిచి హతమార్చాడు. అయితే చాలా కాలంగా కుమార్తె కనిపించకపోవడంతో తమిళ్‌సెల్వి తల్లిదండ్రులు బల్గిత్, మాణిక్యం రెడ్‌హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో మద్రాస్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.  విచారణలో భాగంగా మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు.
చదవండి: ప్రేమ పెళ్లి, మూడేళ్లు సంసారం.. బయటకు వెళ్దామని తీసుకెళ్లి..

దీంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం తమిళనాడు పోలీసులు నారాయణవనం పోలీసుల సహాయంతో కైలాసనాథకోనలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. జూన్‌ 23వ తేదీ వీరిద్దరూ కొండపైకి వెళ్లినట్లు, కొంత సమయానికి మదన్‌ ఒక్కడే కొండ నుంచి కిందకు వచ్చి మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు గుర్తించారు. స్థానికుల సాయంతో గాలించగా అస్థిపంజర స్థితిలో తమిళ్‌సెల్వి మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని నారాయణవనం ఎస్‌ఐ పరమేశ్‌నాయక్‌ తెలిపారు. కాగా మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడమే కాకుండా తాగుడు, గంజాయికి బానిసైన మదన్‌ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిడండ్రులు కోరారు.  

మరిన్ని వార్తలు