బీమా డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య

11 Apr, 2021 14:11 IST|Sakshi

హత్యను ప్రమాదంగా చిత్రీకరించారు 

భార్య, బంధువు అరెస్ట్‌  

సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదమంత్రాల సాక్షిగా మనువాడిన భర్త కంటే అతనిపై పేరు మీదున్న బీమా డబ్బే ఎక్కువైంది ఆమెకు. అప్పులు తీర్చేందుకు భర్త పేరున ఉన్న బీమా పాలసీ నగదుపై కన్నేసింది. భర్తపై పెట్రోలు పోసి తగలబెట్టి సజీవదహనం చేసింది. సజీవదహనాన్ని బంధువు సాయంతో ప్రమాదంగా చిత్రీకరించింది. చివరకు కేసు దర్యాప్తులో పోలీసులు ఎదుట నేరం అంగీకరించింది. ఈరోడ్‌ జిల్లా తుడుప్పదికి చెందిన రంగరాజన్‌(62) చేనేత పరిశ్రమతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. వ్యాపారాల్లో రూ.కోటికి పైగా నష్టాల పాలయ్యాడు. ఈనెల 8న హాస్పిటల్‌ నుంచి వ్యానులో తన భార్య జ్యోతిమణి (55), తన సోదరి అల్లుడు రాజా(40) రంగరాజన్‌కు తోడుగా వస్తున్నారు. 

పెరుమానల్లూరు సమీపంలో ఇంజిన్‌ భాగం నుంచి పొగవచ్చింది. తామిద్దరం కిందికి దిగి రంగరాజన్‌ను బయటకు తీసేలోగా మంటలు వ్యాపించి వ్యాన్‌లో కాలిపోయాడని పోలీసులకు జ్యోతిమణి, రాజా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో జ్యోతి, రాజా పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు వీరిద్దరికీ చిన్నపాటి కాలినగాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రంగరాజన్‌ కుమారుడు నందకుమార్‌ సైతం తన తండ్రి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. 

పోలీసులు తమదైన శైలిలో జ్యోతి, రాజాలను ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని వారు అంగీకరించారు. రంగరాజన్‌కు రూ.1.50 కోట్ల అప్పు ఉంది. దీంతో గతంలో రంగరాజన్‌ రూ.3 కోట్లకు ప్రమాద బీమా చేసి నామినీగా భార్య జ్యోతిమణి పేరును పెట్టాడు. భర్తను హతమార్చి బీమా సొమ్మును కాజేయాలని వారు పథకం పన్నారు. దీనికి రాజాతో ఒప్పందం కుదుర్చుకుని జ్యోతి రూ.50వేలు ఇచ్చింది. ఓ పెట్రోలు బంక్‌ వద్ద క్యానులో పెట్రోల్‌ కొన్నారు. కొంతదూరం వెళ్లార నిర్మానుష్య ప్రాంతంలో వ్యాన్‌ను ఆపారు. నిద్రిస్తున్న రంగరాజన్‌పై, వ్యానుపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. రంగరాజన్‌ అగ్నికి ఆహుతయ్యాక అగ్నిమాపకదళానికి ఫోన్‌ చేసి ప్రమాదం జరిగిందని చెప్పారు.

చదవండి: 

13 ఏళ్ల బాలికకు పెళ్లి, గర్భం.. భర్తపై కేసు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు