'లవ్‌స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ

21 Oct, 2021 01:31 IST|Sakshi
సెల్వన్, ఇళమతి పెళ్లి ఫొటో

చెన్నై: తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సెల్వన్(29) అనే యువకుడు, ఇళమతి(23) అనే యువతి ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి ప్రేమను వ్యతిరేకించాయి. దాంతో కన్నవాళ్లను కాదనుకుని ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు.

ఇద్దరూ కొన్ని నెలలు పాటు సంతోషంగా జీవించారు. అయితే వీళ్లు ఎక్కడ కాపురం పెట్టారో తెలుసుకున్న యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదన చెందిన సెల్వన్ తన భార్యను తీసుకెళ్లిపోయారని తాము మేజర్లమని.. ప్రేమ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపాడు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి ఇళమతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని సెల్వన్ ఆరోపించాడు.

తన భార్య ఇళమతి నుంచి ఇటీవల సెల్వన్‌కు వాట్సాప్‌లో.. తనను చంపాలని చూస్తున్నారని కాపాడాలంటూ మెసేజ్ చేసింది. దాంతో ఆ యువకుడు మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు. తన భార్యకు ప్రాణహాని ఉందని ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు