కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం 

16 Jun, 2021 09:37 IST|Sakshi

తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదు 

శివశంకర్‌ ఆస్తులు రూ. 700 కోట్లు  

డెహ్రాడూన్‌కు సీబీసీఐడీ బృందం 

విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్‌ నోటీసు  

సాక్షి, చెన్నై: కీచక బాబా కోసం విద్యార్థినులను మభ్యపెట్టినట్లు తేలడంతో ఇద్దరు మహిళా టీచర్లపై పోక్సో చట్టంతో పాటు తొమ్మిది సెక్షన్ల కింద మంగళవారం కేసులు నమోదు చేశారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థినులను భారతి, దీప అనే టీచర్లు బలవంతంగా బాబా ఆశ్రమంలోని గదిలోకి తీసుకెళ్లే వారని విచారణలో తేలింది. మరికొందరు టీచర్ల హస్తం కూడా ఉందన్న సమాచారంతో విచారణ వేగం చేశారు. చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కంలోని సుశీల్‌హరి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్‌ బాబా లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు హోరెత్తడంతో సీబీసీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఆయన ఝార్కండ్‌ రాష్ట్రంలోని డెహ్రడూన్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం రావడంతో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి విచారించింది. బాబా జాడ కానరాలేదు. విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సీబీసీఐడీ గుర్తించింది. ఆయన విమానాశ్రయాలకు మంగళవారం లుక్‌ అవుట్‌ నోటీసులను జారీ చేశారు.  

రూ. 700 కోట్ల ఆస్తులు 
బాబా వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అయింది. అందులో తనకు రూ.700 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు స్వయంగా శివశంకర్‌ బాబా మహిళలతో ముచ్చటించారు. బాలికలు, వితంతువులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

చదవండి: తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్‌?

మరిన్ని వార్తలు